Jagannath Rath Yatra 2020: నేటి నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర, ప్రజలు లేకుండా జగన్నాథుడి ఊరేగింపు, యాత్ర సవ్యంగా సాగేందుకు ఆలయ యాజమాన్య కమిటీదే బాధ్యతన్న సుప్రీంకోర్టు
Jagannath-Rath-Yatra (photo-ANI)

Puri, June 23:  పూరీ జగన్నాథ రథయాత్రపై (Jagannath Rath Yatra) విధించిన స్టేను సుప్రీం కోర్టు (Supreme court) ఎత్తేసింది. యాత్ర నిర్వహణకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో సంప్రదాయం ప్రకారం జూన్‌ 23నే(మంగళవారం) రథయాత్ర జరుగనుంది. ఈ యాత్రలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనరాదని షరతు విధించింది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర (Jagannath Rath Yatra 2020) సవ్యంగా సాగేందుకు ఆలయ యాజమాన్య కమిటీదే బాధ్యతని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పూరి జగన్నాథ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి, జగన్నాథుడు రేపు బయటకు రాకుంటే 12 ఏళ్లు యాత్రకు దూరం అవుతాడని కోర్టుకు తెలిపిన సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా

‘కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మంచి రికార్డును పరిగణనలోకి తీసుకున్నాం. అదే జాగ్రత్త, అప్రమత్తతను రథయాత్ర విషయంలోనూ కనబరుస్తారని ఆశిస్తున్నామని తెలిపింది.

యాత్ర సమయంలో పూరీ నగరంలో కర్ఫ్యూ విధించాలని, ఒక్కో రథాన్ని 500 కంటే ఎక్కువ మంది లాగకూడదని, కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వారే రథాన్ని లాగాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేవలం పూరీలో మాత్రమే రథయాత్రను నిర్వహించాలని, రాష్ట్రంలోని ఇతర చోట్ల ఎక్కడా జరుపకూడదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఒడిశా ప్రభుత్వాన్ని కోరింది.

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పూరీ యాత్రపై జూన్‌ 18న సుప్రీం కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. రథయాత్రపై స్టే ఆదేశాలను సవరించాలని కేంద్రం కోరడంతో సోమవారం ధర్మాసనం స్టేను ఎత్తేసింది. రథయాత్రకు అనుమతినివ్వడంతో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో విధించిన స్టేను ఎత్తేయాలంటూ జగన్నాథ్‌ సంస్కృతి జన జాగరణ మంచ్, బీజేపీ నేత సంబిత్‌ మహాపాత్ర తదితరులు పిటిషన్లు వేయడం తెల్సిందే.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ బొపన్నల బెంచ్‌ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే నాగ్‌పూర్‌లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ ట్రస్టు సహకారంతో ప్రజారోగ్యంపై ఏ మాత్రం రాజీపడకుండా రథ యాత్రను చేపడతామని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ హామీ ఇచ్చారు. కేంద్రం, ఆలయ యాజమాన్యంతో సమన్వయం చేసుకుని రథయాత్రను నిబంధనలకు లోబడి సజావుగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ రథయాత్ర 10 నుంచి 12 రోజుల పాటు కొనసాగనుంది.

సుప్రీంకోర్టు నిబంధనలివీ

రథయాత్ర సమయంలో పూరీ నగరంలో కర్ఫ్యూ విధించాలి.

ప్రజలు ఇళ్లలోంచి బయటకురావద్దు

ఒక్కో రథాన్ని 500 మంది (పోలీసులు, సిబ్బంది కలిపి) మాత్రమే లాగాలి.

ఒక్కో రథం గంట సమయం తేడాతో ముందుకు కదలాలి.

నగరంలోకి ప్రవేశించే అన్ని దారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను మూసివేయాలి.

తీర్పు వెలువడిన సోమవారం రాత్రి 8 గంటల నుంచే కర్ఫ్యూ అమలు.

వీలైనంత ఎక్కువగా ఈ కార్యక్రమం కవరయ్యేలా మీడియాకు అనుమతి.

రథాన్ని లాగే వారందరికీ కరోనాæ పరీక్షలు చేయాలి. రథయాత్రకు ముందు, రథయాత్ర సమయంలో, తర్వాతా వారు భౌతిక దూరం పాటించాలి. వారందరి ఆరోగ్య రికార్డులను నిర్వహించాలి.