Puri, June 22: ఎట్టకేలకు పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం కోర్టు (Supreme Court) అనుమతి ఇచ్చింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు లేకుండా రథయాత్ర (Puri Rath Yatra 2020) జరుపుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. పూరీ రథయాత్ర విషయంలో రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ జరిపి ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు, భారత్‌లో కరోనా విశ్వరూపం, దేశ వ్యాప్తంగా 4,25,282 కోవిడ్-19 కేసులు, 13,699 మంది మృతి
జూన్ 23వ తేదీన ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర ( Jagannath Puri Rath Yatra 2020) జరగాల్సి ఉన్నది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు కరోనా వేళ యాత్రకు కోర్ట్ అనుమతి ఇవ్వలేదు. యాత్రకు అనుమతి ఇస్తే తమను ఆ జగన్నాథుడు క్షమించడని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. రథయాత్రను నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నామని కేంద్రం, ఒడిశా ప్రభుత్వం సుప్రీంకు తెలియజేసింది.
ఈ కేసుపై ఇవాళ సుప్రీంలో ఆసక్తికర వాదనలు జరిగాయి. ఇది కోట్ల మంది విశ్వాసాలకు సంబంధించిన అంశమని, రేపు జగన్నాథుడు బయటకు రాకుంటే, సంప్రదాయం ప్రకారం ఆ స్వామి 12 ఏళ్లు యాత్రకు దూరం అవుతాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. రేపు జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా పూరిలో కర్ఫ్యూను విధించి వైరస్ వ్యాప్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంని కేంద్రం కోర్టుకు వెల్లడించింది. పూరీ జగన్నాథ రథయాత్రపై సుప్రీంకోర్టు స్టే
శతాబ్ధాలుగా జరుగుతున్న వేడుకను అడ్డుకోలేమని, కరోనా పరీక్షలో నెగటివ్ వచ్చినవాళ్లు, జగన్నాథుడి ఆలయంలో పనిచేస్తున్న వారు మాత్రమే ఈ రథయాత్ర వేడుకలో పాల్గొంటారని తుషార్ మెహతా తెలిపారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలతో ఏకీభవించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం బెంచ్ రథయాత్రకు అనుమతి ఇచ్చింది. ప్రజలు లేకుండా రథయాత్ర చేపట్టాలని తీర్పును వెలువరించింది.