Hyderabad, July 9: ఆషాడమాసంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న సికింద్రాబాద్ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు (Ujjaini Mahakali Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి కుటుంబసభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. #LashkarBonalu #SecunderabadBonalu #Bonalu pic.twitter.com/fYGZpye9TK
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 9, 2023
ఎమ్మెల్సీ కవిత కూడా..
ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఆదయ్య నగర్ కమాన్ వద్ద పూజల్లో పాల్గొంటారు. ఇక, అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఆలయానికి వచ్చే లైన్, ఎంజీ రోడ్డు రాంగోపాల్‌పేట్ పాత పోలీస్‌స్టేషన్ కొత్త ఆర్చీ గేట్ నుంచి మహంకాళి పోలీస్‌స్టేషన్ మీదుగా ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ జనరల్ బజార్ అంజలి టాకీస్ వైపు నుంచి వీఐపీలకు-1, సాధారణ భక్తులకు-1 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్‌పేట్ పీఎస్ నుంచి సాధారణ భక్తుల క్యూలైన్ ఉంటుంది. డోనర్ పాస్‌ల కోసం ఎంజీ రోడ్డులో ఆలయం వెనక వైపు నుంచి మరో క్యూలైన్ ఉంటుంది. ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ ఎదురు నుంచి వీవీఐపీలకు అమ్మవారి ఆర్చిగేట్ ద్వారా అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. బోనాల పండగ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం నగరంలో ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది.