నవంబర్ 8న చంద్ర గ్రహణం సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేస్తున్నట్లు (Tirumala temple to remain closed) ఆలయ అధికారులు వెల్లడించారు. ఆ రోజున అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు.
మధ్యాహ్నం 2. 39 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం సందర్భంగా ఆలయ తలుపులు ఉదయం 8. 40 గంటలకు మూసివేసి రాత్రి 7. 20 గంటలకు తిరిగి తెరవబడతాయని తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలు, సేవలను రద్దు చేశామని పేర్కొన్నారు. ఆలయ తలుపులు తెరచిన తరువాత వైకుంఠ క్యూకాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తామని వివరించారు.
ఇక తిరుమలలో (Tirumala temple) భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 70,263 మంది భక్తులు దర్శించుకోగా 28,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చిందని తెలిపారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 20 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయని, చివరిరోజున భక్తులు విశేషంగా విచ్చేసే పంచమి తీర్థానికి పటిష్టంగా ఏర్పాట్లు చేపడుతున్నామని జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల నుంచి వచ్చే సారె ఊరేగింపు రూట్‌మ్యాప్‌ను పరిశీలించి, ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్థానిక పోలీసుల సహకారం తీసుకుని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
ముఖ్యంగా ఈ ఊరేగింపులో ఏనుగులు బెదరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులు వేచి ఉండేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలని, అక్కడ అన్నప్రసాదాలు, తాగునీరు, అదనంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.