Tirumala Update: ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఆన్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
two-days-vaikunta-dwara-darshanam-tirumala-says-yv-subba-reddy (Photo-Twitter)

Tirumala, Sep 17: శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలను (Srivari Brahmotsavam) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) ప్రకటించారు. కాగా, కేంద్రం మరోసారి కరోనా హెచ్చరికలు జారీచేసిన క్రమంలో రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చైర్మన్‌​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కొన్నిసాంకేతిక సమస్యల కారణంగా.. ఆన్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ ఆలస్యమైందని అన్నారు. వారంలోగా సమస్యను పరిష్కరించి భక్తులకు స్వామివారి దర్శనం అయ్యేలా చర్యలు చేపడతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. వాహన సేవలన్నీ ఆలయ ప్రాకారానికే పరిమితమవుతాయని చెప్పారు.

అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్న రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల భారీ విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. రవి ఐకా ఇప్పటికే టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు.

ఈ నెల 19వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌, నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ఎస్ఈసీ, ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు

ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రస్తుతం తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేశారని చెప్పారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈఓ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తయారు చేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా మార్కెట్లో ప్రవేశపెట్టాలని, ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈఓ కేఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిపాలనా భవనంలోని తన చాంబర్‌లో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ శాఖ నుంచి పంచగవ్య ఉత్పత్తులకు లైసెన్సులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. ఈ లోపు ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన డిజైన్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ముడి పదార్థాల సేకరణ, యంత్రాలను సిద్ధం చేసుకుని యంత్రాల ఏర్పాటుకు అవసరమయ్యే విద్యుత్, ఇంజినీరింగ్‌ పనులను సిద్ధం చేయాలని ఆదేశించారు. కోయంబత్తూర్‌కు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు.. సదరు సంస్థ పది సంవత్సరాల పాటు ఆయుర్వేద ఉత్పత్తులు తయారుచేసి టీటీడీకి అందజేస్తుందని ఈఓ వివరించారు. ఫ్లోర్ క్లీనర్, సబ్బులు, షాంపూ, దంత మంజనం పౌడర్, ఆయుర్వేద అగరబత్తులు లాంటి ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు.

వీటిలో టీటీడీ వాడగా, మిగిలినవి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ నుంచి 70 రకాల గో ఆధారిత ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఆయుష్ వద్ద లైసెన్సులు పొందే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు. ఆయుర్వేద ఫార్మసీలో ఇప్పటికే 115 రకాల మందులు తయారు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. సమావేశంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, పశువైద్య విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రవి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ టెన్షన్ ప్రొఫెసర్ వెంకట నాయుడు పాల్గొన్నారు.