TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, సెప్టెంబర్ 18 నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
TTD EO Darmareddy (Photo-TTD)

Tirumala, August 31: సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు గరుడ సేవ రోజున రద్దీ దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలను తీసుకుంటున్నామని వివరించారు.

భక్తులకు వైద్యం అందుబాటులో ఉంచేందుకు రుయా ఆసుపత్రి నుంచి సిబ్బందిని రప్పిస్తామని చెప్పారు. ఘాట్ రోడ్డులో 24 గంటలపాటు ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలిపారు. క్రూర మృగాల సంచారం నేపథ్యంలో నడకదారులు, ఘాట్ రోడ్లలో ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. అటవీ శాఖ ఇచ్చే నివేదిక మేరకు నడక మార్గంలో నిబంధనలను సడలిస్తామని వివరించారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆలయం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ చైర్మన్‌ విడుదల చేశారు.

సెప్టెంబరు 18వ తేది నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరధం, 25న రధోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజా అవరోహనం నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో అధిక రద్దీ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నమని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏడు రోజులు ఏటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు.