Credits: TTD

Tirumala, July 26: తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్కరిణిని నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని తెలిపారు. ఈ నెల రోజుల పాటు పుష్కరిణికి హార‌తి ఉండ‌దని వివరించారు.

సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదని, పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవ‌స్థ అందుబాటులో ఉందన్నారు. నిరంత‌రాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తామని తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొల‌గించి చిన్న చిన్న మ‌ర‌మ్మతుల‌ను పూర్తి చేస్తామన్నారు. మరమ్మతులు పూర్తి చేసి చివ‌రి ప‌ది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తామని వివరించారు. పుష్కరిణిలోని నీటి పీహెచ్ విలువ 7 ఉండేలా టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ (Water works ) విభాగం చర్యలు తీసుకుంటుందన్నారు.

కేదార్‌నాథ్ ఆలయంలో ఇకపై మొబైల్ ఫోన్లు నిషేధం, సంచలన నిర్ణయం తీసుకున్న కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ

భారీ వర్షాలకు తిరుమలలో భక్తుల రద్దీ కొంతమేరకు తగ్గింది. కొందరు భక్తులు తిరుమల ప్రయాణం వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు వేర్వేరు కారణాలతో కొండపైకి రాలేకపోతున్నారు. దీంతో భక్తుల రద్దీ తగ్గింది. ముఖ్యంగా సర్వదర్శనం నిన్న కేవలం ఆరు గంటల్లోనే జరిగింది. ఉదయం తిరుమలో ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఉన్నారు. సర్వదర్శానానికి కేవలం ఆరు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం తర్వాత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇక, నిన్న(మంగళవారం) తిరుమల శ్రీవారిని 73,137 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే, శ్రీవారికి 27,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

వైష్ణో దేవి మాత ఆలయాన్ని ముంచెత్తిన వరద, కొండచరియలు విరిగిపడే ప్రమాదంతో దర్శనానికి బ్రేక్

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లుగా ఉంది. ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులు త్వరగా వేంకటేశ్వరుడి దర్శనం పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే, భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లు ఆన్ లైన్ లో చేసుకుని ఆ తర్వాతే కొండపైకి రావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని టిటిడి అధికారులు సూచించారు. ముందస్తుగా బుక్ చేసుకోకపోతే.. కొండపై కష్టమవుతుందని, సర్వదర్శనం మినహా ఏ విధంగా దర్శించుకోలేరని స్పష్టం చేశారు.

తిరుపతి, తిరుమలలో వర్షం ఎడతెరిపి లేకుండా పడుతోంది. మధ్యమధ్యలో కొంత తెరిపినిచ్చినా.. వర్షం పూర్తిగా తగ్గడం లేదు. కొండ మీద ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. చలి పెరిగింది. సాధారణంగానే శ్రీ వేంకటేశ్వరుడి నివాసమైన తిరుమల గిరులపై చల్లగా ఉంటుంది. మారిన వాతావరణంతో మరింత చల్లగా మారింది.