తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో సర్వదర్శనం క్యూలైన్ గోగర్భం జలాశయం వరకు చేరుకున్నది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు.
ఇక టోకెన్ లేని భక్తులకు శ్రీనివాసుడి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. కాగా, ఏప్రిల్ 6న స్వామివారిని 60,101 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,991 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.