ఏదైనా ఆటలో బాగా ఆడిన వారికి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డ్ ఇస్తారు. అయితే 'మ్యాన్' అనే పదంలో ఏం ఇబ్బంది అనిపించిందో గానీ మారుతున్న కాలం కొద్ది దానిని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా పిలుస్తున్నారు. అయితే మ్యాన్‌కు బదులు ప్లేయర్‌గా ఎందుకు మార్చారో చాలా కాలం తర్వాత అందుకు ఒక జవాబు దొరికింది. ఆటలో బాగా ఆడిన వారు మనిషే అయి ఉండక్కర్లేదు అని. అది కోడి కావొచ్చు లేదా ఆవు కూడా కావొచ్చు. అవును..ఆవే! ఆవులు పాలు ఇవ్వడమే కాదు అవసరమైతే ఫుట్‌బాలు కూడా ఆడుతాయి.  అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇది ఎక్కడో జరిగింది కూడా కాదు, వీడియోలో జరిగే సంభాషణను బట్టి చూస్తే అది ఇండియాలోనే, గోవాలో ఏదో ప్రాంతంలో జరిగినట్లు అర్థమవుతుంది. కొంతమంది యువకులు ఒక గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడుతుండగా ఈ ఆవు ఏదో సబ్సిట్యూట్ ప్లేయర్ లాగా ఎంటర్ అయింది. రెండు కాళ్లు ఉన్నా వాళ్ళే ఫుట్‌బాల్ ఆడగా లేనిది, నాలుగు కాళ్ళు ఉన్న నేనెంత తోపు అనుకుందో ఏమో ఆ ఫుట్‌బాల్‌ను ఆటగాళ్లకు కూడా దొరకకుండా దానిని అటూ ఇటూ తన్నుతూ గోల్ చేసింది. అక్కడున్న వారికంతా ఇది ఒక హఠాత్పరిణామం, ఎవరూ ఊహించనటువంటింది. ఈ తతంగాన్నంతా అక్కడున్న వారు ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో ఇదెక్కడి విచిత్రమని ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది.

ఎవరూ ఊహించని విధంగా అంచనాలకు మించి ఫుట్‌‌‌బాల్ ఆడి గోల్ కొట్టింది కాబట్టి, ఆ ఆటలో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు ఆవు దక్కించుకుంది.