cm-chandrababu-tour-in-flood-affected-areas-in-vijayawada (photo-X/TDP)

Vjy, Sep 18: ఏపీలో విజయవాడ వరదలు(Floods), భారీ వర్షాలకు(Rains) నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్‌ని ప్రకటించింది. విజయవాడలో వరదలకు పూర్తిగా నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు, మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లల్లో నీళ్లు వచ్చిన బాధితులకు రూ. 10 వేలు, చిరువ్యాపారులకు రూ. 25 వేలు అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఇక చేనేత కార్మికులకు రూ. 15 వేలు, మగ్గం కోల్పోయిన వారికి రూ. 25 వేలు, ఫిషింగ్‌ బోట్లకు నెట్‌ దెబ్బతిని పాక్షికంగా ధ్వంసమైతే రూ. 9 వేలు, పూర్తిగా ధ్వంసమైతే రూ. 20 వేలు అందజేస్తామని వివరించారు. బైకుల బీమా, మరమ్మతులకు సంబంధించి 9వేలకు పైగా క్లెయిమ్‌లు వచ్చాయని, ద్విచక్రవాహనదారులు రూ. 71 కోట్ల మేర క్లెయిమ్‌ చేయగా రూ. 6 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. మరో 6వేల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, త్రిచక్రవాహనదారులకు రూ. 10 వేలు ఆర్థికసాయం చేస్తామన్నారు.

ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులు కేటాయింపు, ముందుగా 3,396 దుకాణాలు నోటిఫై, కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం

రూ. 40 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ. లక్ష, రూ. 1.5 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ. 1.5 లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు వివరించారు. విజయవాడలోని 179 సచివాలయాలు, 32 వార్డులతో పాటు ఇబ్రహీంపట్నం, జక్కంపూడి కాలనీ, వాంబే కాలనీల్లో నీటమునిగిన గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఒక్కో కుటుంబానికి రూ.25వేల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే మొదటి, అంతకంటే పై అంతస్తుల్లోని కుటుంబాలకు రూ.10 వేలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లకు రూ.10 వేలు ఇవ్వనున్నారు.

వరదల వల్ల దెబ్బతిన్న రైతుల్ని ఆదుకునేందుకు వివిధ రకాల పంటలకూ పరిహారం ప్రకటించారు. ‘‘వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైనా అద్దె ఇళ్లలో నివసిస్తుంటే.. వారికే పరిహారం అందిస్తాం. ఇంటి యజమాని బీమా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. పంట నష్టపరిహారం కూడా కౌలు రైతులకే చెల్లిస్తాం’’ అని చెప్పారు. ముంపు బారిన పడ్డ కిరాణా దుకాణాలు, హోటళ్లు, ఇతరత్రా చిరువ్యాపారాలు, సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలకూ ప్యాకేజీ ఇచ్చారు. దెబ్బతిన్న ద్విచక్రవాహనాలు, ఆటోలు, ఫిషింగ్‌ బోట్లకూ పరిహారం ఖరారు చేశారు. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం 2,72,272 కుటుంబాలు బాధితులుగా మారాయని తెలిపారు.

పంట నష్టాలకు చంద్రబాబు ప్రకటించిన పరిహారం వివరాలు

పత్తి, వేరుసెనగ, వరి, చెరకు తొలి పంటలకు హెక్టారుకు రూ.25,000

సజ్జలు, మినుములు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, జ్యూట్, కొర్రలు, సామలకు హెక్టారుకు రూ.15వేలు

తమలపాకు తోటలకు హెక్టారుకు రూ.75వేలు

అరటి, పసుపు, కంద, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, దానిమ్మ, యాపిల్‌బేర్, సపోటా, జీడిమామిడి, డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటలకు హెక్టారుకు రూ.35వేలు

కూరగాయలు, బొప్పాయి, టమాటా, పువ్వులు, ఉల్లిపాయలు, పుచ్చకాయల తోటలు, నర్సరీలకు హెక్టారుకు రూ.25 వేలు

ఆయిల్‌పామ్, కొబ్బరిచెట్లు ఒక్కో దానికి రూ.1,500 చొప్పున గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్నవారికి ఇంటికి రూ.50వేల చొప్పున, మొదటి, అంతకంటే పై అంతస్తుల్లో ఉన్నవారికి రూ.25 వేల చొప్పున రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరాం. మూడు నెలల మారటోరియం విధించి, తర్వాత 36 నెలల్లో ఆ మొత్తాన్ని చెల్లించేలా అవకాశం కల్పించాలని అడిగాం.

దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ఎంఎస్‌ఎంఈల రుణాలను రీషెడ్యూల్‌ చేసి.. రెండేళ్ల పాటు మారటోరియం ఇవ్వాలని బ్యాంకర్లను అడుగుతున్నాం. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. స్వల్పకాలిక పంటరుణాలను రీషెడ్యూల్‌ చేసి 12 నెలల మారటోరియం ఇవ్వాలని అడిగాం. టర్మ్‌లోన్స్‌ వాయిదాలను రీషెడ్యూల్‌ చేసి కొత్త రుణాలివ్వాలని కోరాం.

అర్బన్‌ కంపెనీ ద్వారా 3,748 సర్వీసు రిక్వెస్ట్‌లు రాగా.. 3,569 రిక్వెస్ట్‌లకు సర్వీసు పూర్తిచేశాం. శామ్‌సంగ్, బ్లూస్టార్, డైకిన్, గోద్రెజ్‌ లాంటి 14 కంపెనీలకు 3,727 సర్వీస్‌ కాల్స్‌ అందాయి. వాటిలో 1,400 పరిష్కరించారు. వాటి సర్వీసు సెంటర్లకు వెళ్లి పరిశీలిస్తాను. వారు సరిగ్గా చేయకపోతే ఆ కంపెనీల బండారం బయటపెడతాను. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల మరమ్మతుల విషయంలో మోసాలు జరగకుండా రవాణా కమిషనర్‌ బాధ్యత తీసుకోవాలి. కంపెనీల వర్క్‌షాపులతో పాటు బయట మెకానిక్‌లతోనూ రిపేర్లు చేయించాలి.

ఆస్తిపన్ను వసూలు గడువును మూడు నెలలు పొడిగిస్తున్నాం.

ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందిస్తాం. వివిధ రకాల సర్టిఫికెట్లు, ల్యాండ్‌ రికార్డులు, ఆధార్, రేషన్‌కార్డులు... ఇలా ఏం పోయినా సరే వాటిని అందిస్తామని సీఎం అన్నారు.