Bhopal, Dec 7: కరోనాఫోబియా (Covidphobia) ఇప్పుడు చాలామందిని వేధిస్తోంది. ఎవరిని కలిస్తే వైరస్ సంక్రమిస్తుందోనన్న భయంతో (Fearing Coronavirus Infection) చాలామంది ఇతరులను కలవడానికే భయపడుతున్నారు. అయితే బయట పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా పెళ్లయిన జంట కూడా కోవిడ్ ఫోబియా భారీన పడి కొన్ని పనులకు దూరమయ్యే పరిస్థితి (Bhopal Man Maintains Physical Distance) కూడా నెలకొని ఉంది.
తాజాగా మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ఒక వ్యక్తి తన భార్యకు కరోనా సోకిందనే అనుమానంతో ఆమెను దూరం పెట్టాడు. దీంతో భార్య అతనిపై కేసు వేసింది. తన భర్త సంసారానికి పనికిరాడని భరణం ఇప్పించాలని కోర్టు మెట్లు ఎక్కింది.
వివరాల్లోకెళితే.. కరోనా వైరస్ సోకుతుందనే భయంతో కొత్తగా పెళ్లయిన ఓ యువకుడు తన భార్య దగ్గరికి వెళ్లేందుకు భయపడ్డాడు. దీంతో ఆ యువతి తన భర్త సంసారానికి పనికి రాడనీ, భరణం ఇప్పించాలని కోర్టు గడప తొక్కింది. ఈ కేసు భోపాల్ లా ట్రిబ్యునల్ (లీగల్ అథారిటీ) ముందుకు రావడంతో అందరూ అవాక్కయ్యారు. కాగా ఈ జంటకు ఈ ఏడాది జూన్ 29వ తేదీన వివాహమైంది. అప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉండటంతో ఆ యువకుడు కరోనా సోకుతుందనే భయంతో భార్య దగ్గరికి వెళ్లేందుకు జంకాడు. దాదాపు మూడు నెలల పాటు అత్తవారింట్లోనే ఉన్న ఆ యువతి విసిగి వేసారి పుట్టింటికి వెళ్లిపోయింది.
రెండు నెలలపాటు పుట్టింట్లో గడిపిన భార్య భరణం కావాలంటూ డిసెంబర్ 2వ తేదీన భోపాల్ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. పెళ్లయిన ఈ 5 నెలల్లో అత్తమామలు తనను వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. భర్త ఫోన్‌లో బాగా మాట్లాడేవాడని, దగ్గరకు మాత్రం రాలేదని తెలిపింది. న్యాయాధికారుల కౌన్సెలింగ్‌లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా ఫోబియా కారణంగానే ఆ యువకుడు దాంపత్య విధిని నెరవేర్చలేదని తేలింది. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి, అంతా సరిగ్గా ఉందని ధ్రువీకరించారు. కౌన్సెలింగ్ అనంతరం ఆ యువతి భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్లిందని భోపాల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సందీప్ శర్మ తెలిపారు.