Hyderabad: మన ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసిన కొంతమంది వాహనదారులు 'ఈ రోడ్డు మాది' అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రెడ్ సిగ్నల్ పడినా ఏమి లెక్క చేయకుండా దూసుకెళ్లేవారు ఎంతో మంది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) కూడా కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిని నియంత్రించేలా ఓ వినూత్న ప్రయోగానికి అంకురార్పన చేశారు. నగరంలోని కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద రోడ్డుపై LED సిగ్నలింగ్ వ్యవస్థ (LED Traffic Signaling) ను ఏర్పాటు చేశారు. మామూలుగా స్థంభానికి ఉండే సిగ్నలింగ్ వ్యవస్థ లాగానే ఇవీ పని చేస్తాయి. కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎవరు లైన్ దాటి ముందుకు వచ్చినా స్పష్టంగా అందరికీ తెలిసిపోతుంది. రోడ్డు క్రాస్ చేసే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇవి రోడ్డుపై మిలమిలా మెరుస్తూ స్పీడ్ బ్రేకర్స్ లాగా అనిపిస్తూ వాహనదారులను ఆగి వెళ్లేలా చేస్తున్నాయి. అంతేకాదు, ఇవి వాటర్ ప్రూఫ్. వర్షాకాలంలోనూ వీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వ్యవస్థ ఇండియాలోనే తొలిసారిగా హైదరాబాదులోనే ఉండటం విశేషం . హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న ఈ చొరవకు నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది, దీంతో గనుక ట్రాఫిక్ పోలీసులు అనుకున్న లక్ష్యాలను సాధించగలిగితే నగరవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.