
Gaya, July 12: పెళ్లి కొడుకు విగ్గుతో బట్టతలను దాచిపెట్టి పెళ్లికి సిద్ధమవడంతో విషయం తెలుసుకున్నవధువు తరపు బంధువులు మండపంలోనే అతన్ని చితకబాదారు. తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. బీహార్ గయ జిల్లాలోని డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ఘటన చోటు చేసుకుంది. బజౌరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు పెళ్లయిన విషయం దాచిపెట్టి ఓ యువతిని రెండోపెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. పైగా తనకున్న బట్టతలను దాచిపెట్టేందుకు చక్కగా విగ్గు ధరించి మండపానికి చేరుకున్నాడు. కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే, అప్పటికే విషయం వధువు బంధువులకు తెలిసిపోయింది. అతడికి అప్పటికే వివాహం జరిగిందని, విగ్గు ధరించి రెండో పెళ్లికి తయారైనట్టు తెలిసి వధువు బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. అతడిని పట్టుకుని విగ్గు తొలగించి చితక్కొట్టారు. దెబ్బలకు తాళలేని పెళ్లికొడుకు తాను చేసింది తప్పేనని, వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. విషయం తెలిసిన అతడి భార్య మండపానికి చేరుకుని అతడిని రక్షించి తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ విషయమై గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించారు.