Rishabh Pant vs Liton Das Video (Photo/X/Screen Grab)

చెన్నై వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న‌ తొలి టెస్టులో టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ ప్రారంభించిన‌ భార‌త జ‌ట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సార‌థి రోహిత్‌ శర్మ, శుభ్‌మ‌న్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ కొద్ది వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. వలం 34 ర‌న్స్‌కే టీమిండియా కీల‌క‌మైన‌ 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, రిష‌భ్‌ పంత్ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే పంత్ క్రీజులో ఉన్నప్పుడు అతడి కాన్సన్‌ట్రేష‌న్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో బంగ్లా వికెట్‌ కీపర్‌ లిట్టన్‌ దాస్‌ గొడవకు దిగాడు. విషయంలోకి వెళ్తే..బంగ్లాదేశ్ బౌలర్‌ తస్కిన్‌ అహ్మద్ వేసిన‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో ఈ వివాదం చోటుచేసుకుంది. ఫీల్డర్‌ త్రో విసిరిన బంతి పంత్‌ ప్యాడ్‌కు తగిలి మిడ్‌ వికెట్‌ వైపు వెళ్లింది. దీంతో పంత్ ఎక్స్‌ట్రా ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించాడు. కానీ, యశస్వి నో చెప్పడంతో తిరిగి క్రీజులోకి వచ్చేశాడు పంత్‌.

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్, డీడీ స్పోర్ట్స్, డీడీ ఫ్రీ డిష్, దూరదర్శన్ నేషనల్ టీవీ ఛానెల్‌లో లైవ్ టెలికాస్ట్ ఉందా?

అయితే, బంగ్లా కీపర్‌ లిట్టన్‌ దాస్‌ మాత్రం దానికి ప‌రుగు ఎలా తీస్తావ్‌ అంటూ పంత్‌కు ఏదో చెప్పబోయాడు. దాంతో మ‌నోడు అత‌నికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. మరి బాల్‌ వికెట్లకు తగిలేలా విస‌రాలి క‌దా... నన్నేందుకు కొడుతున్నారు? అంటూ పంత్‌ రివర్స్ కౌంటర్‌ వేశాడు. అలా కొద్ది సేపు ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. వారి మాట‌లు స్టంప్‌లోని మైక్‌ల‌లో రికార్డు అయ్యాయి.

Here's Video

ఇక అప్పటి వరకు జాగ్రత్తగా ఆడిన పంత్‌.. లిట్టన్‌ దాస్ మాట‌ల‌తో ఒక్క‌సారిగా గేర్ మార్చాడు. ఆ త‌ర్వాత‌ అదిరిపోయే షాట్లు ఆడాడు. దాస్‌తో ఘ‌ర్ష‌ణ‌కు ముందు 17 బంతుల్లో కేవ‌లం 14 ర‌న్స్ మాత్రమే చేసిన పంత్ ఆ త‌ర్వాత చెల‌రేగిపోయాడు. వివాదం తర్వాత 44 బంతుల్లో 5 బౌండ‌రీల‌తో 33 పరుగులు చేశాడు. కానీ లంచ్ తర్వాత 39 పరుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద పెవిలియ‌న్ చేరాడు. అది కూడా లిట్ట‌న్ దాస్‌కే క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. ప్రస్తుతం నెట్టింట‌ లిటన్ దాస్, పంత్ గొడ‌వ తాలూకు వీడియో వైరల్ అవుతోంది.