Newdelhi, October 29: విదేశీ విద్యా సంస్థల (Foreign institutions) సహకారంతో దేశంలోని ఎడ్‌టెక్ కంపెనీలు (EdTech Companies) అందించే ఆన్‌లైన్ (Online) పీహెచ్‌డీ ప్రోగ్రాములకు (PhD) ఎలాంటి గుర్తింపు లేదని, కాబట్టి వాటిని చదివి మోసపోవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ-UGC), అఖిల భారత సాంకేతిక విద్యా విభాగం (ఏఐసీటీఈ-AICTE) హెచ్చరికలు జారీ చేశాయి. ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రాములకు సంబంధించి ఎడ్‌కంపెనీలు ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని ఈ రెండు సంస్థలు పేర్కొన్నాయి. వాటి ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రామలను యూజీసీ గుర్తించదని స్పష్టం చేశాయి.
పీహెచ్‌డీ అడ్మిషన్ తీసుకోవడానికి ముందు విద్యార్థులు వాటి ప్రామాణికతను నిర్ధారించుకోవాలని సూచించాయి. పీహెచ్‌డీ డిగ్రీలను ప్రదానం చేసేందుకు విద్యాసంస్థలు యూజీసీ నిబంధనలు, సవరణలను అనుసరించడం తప్పనిసరని స్పష్టం చేశాయి. కాగా, యూజీసీ, ఏఐసీటీఈ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఈ ఏడాది ఇది రెండోసారి. ఎడ్‌టెక్ కంపెనీలతో కలిసి దూరవిద్య, ఆన్‌లైన్ మోడ్‌లో కోర్సులు అందించకుండా గుర్తింపు పొందిన వర్సిటీలు, సంస్థలకు ఈ రెండు ఈ ఏడాది మొదట్లో హెచ్చరికలు జారీ చేశాయి.