Plastic Bag Kids: అక్కడ బడికి వెళ్లాలంటే బాహుబలిలో శివగామిలా ఎవరో ఒకరు నది దాటించాలి. ప్లాస్టిక్ కవర్లో పిల్లలను నది దాటిస్తున్నారు.
School kids being carried across river in plastic bags.| Photo Credits: Vov

మేము ఉండేది ఎక్కడో మారుమూల ప్రాంతం, మా ఊరికి కనీసం రోడ్డు మార్గం కూడా లేదు, బడికి వెళ్లాలంటే రోజు 4 కి. మీ నడిచివెళ్లాలి, తిరిగి అదే మార్గంలో రావాలి అని కొంతమంది చెప్తుంటారు. నిజమే ఇది కొంతవరకు కష్టమైన వ్యవహారమే.

కానీ,జీవితం బాగుపడాలి అంటే చదువు ఉండాలి. చదువు  విలువ తెలుసిన ఒక మారుమూల ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు తమ బిడ్డలను ఉదయాన్నే స్కూలుకు పంపేందుకు సిద్ధం చేసి వారి ప్రాణాలకు తెగించి, తమ బిడ్డల ప్రాణాలను సైతం అరచేతిలో మోస్తూ క్రమం తప్పకుండా బడికి పంపిస్తున్నారు.

ఇది ఎక్కడ అంటే వియత్నాం (Vietnam) దేశంలోని 'హువోయ్ హ' ఒక మారుమూల ప్రాంతం. ఆ ఊరికి అసలు ఎలాంటి మార్గం లేదు, ఆపై ఓ పెద్ద నదిని దాటాల్సి ఉంటుంది. కర్ర బొంగులు, తాళ్లతో తామంతట తామే తాక్కాలిక వంతెనలను ఏర్పాటుచేసుకున్నా, వరదలు వచ్చినప్పుడు ఆ వంతెనలు నదిలో కొట్టుకుపోతున్నాయి.

దీంతో ఆ గ్రామ పెద్ద అయిన Mr. Vo A, ఎలాంటి నదీ ప్రవాహంలో అయిన ఈదగలిగే, ధృడమైన యువకుడిని నదిని దాటించేందుకు నియమించారు.  50కి పైగా ఉన్న స్కూల్ పిల్లలను (School Kids) సురక్షితంగా నది దాటించి అవతలి ఒడ్డుకు చేర్చే బాధ్యతను ఆ ఈతగాడికి అప్పజెప్పారు. అయితే నీటిలో ఈదుకుంటూ తీసుకెళ్తే ఆ పిల్లల యూనిఫాం తడిసిపోతుంది. అందుకు ప్రత్యామ్నాయంగా ఆ పిల్లలను ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి, గాలి ఆడేందుకు తగిన ఏర్పాట్లు చేసి, ఆ ఈతగాడు నదీ ప్రవహానికి ఎదురీదుతూ స్కూల్ పిల్లలను ఒక్కొక్కరి చొప్పున ఆ ప్లాస్టిక్ కవర్ లో లాగుకెళ్తూ అవతలి ఒడ్డుకు చేరుస్తున్నాడు.

ఇలా చేరుస్తున్నప్పుడు  ఇవతలి ఒడ్డుపై వేచి చూసే స్కూల్ పిల్లలు ఇక తమ వంతు వచ్చేసరికి వారి ముఖాల్లో ఒక రకమైన బెరుకు, ఆందోళన స్పష్టంగా కనిపిస్తుందట. ఆ ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసేటపుడు కూడా భయపడుతున్నారని తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే తమకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో  ఇంకా చేసేదేం లేక వారిని అలాగే బడికి పంపుతున్నట్లు గ్రామపెద్ద చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితిపై అక్కడి మీడియా సంస్థలు ఇటీవలే వరుస కథనాలు ప్రచురిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకొని అందుకనుగుణంగా బ్రిడ్జి మరియు పిల్లలు స్కూలుకు వెళ్లేందుకు అనువుగా ప్రయాణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

మన దగ్గర తల్లిదండ్రులు వారి పిల్లలకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేసినా పిల్లలు మాత్రం బడికి వెళ్లేందుకు మారాం చేస్తారు. జ్వరం వచ్చిందనో, వర్షం పడుతుందనో, కడుపు నొస్తుందనో చెప్పి రకరకాల యాక్టింగ్ లు చేస్తూ స్కూల్ కు ఎగనామం పెట్టే చర్యలు చేస్తారు. కానీ ఈ వియత్నాంలోని ఇలాంటి పరిస్థితిని ఉదాహారణగా చూపించి పిల్లలకు చదువు విలువ తెలిసేలా, చదువు పట్ల ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు చొరవ చూపాలనే ఉద్దేశ్యంతో ఈ కథనం అందిస్తున్నాం.