Storm Area 51:ఆ ప్రాంతంలో ఏలియన్స్ ను బంధించారా? ఎందుకు అమెరికా దానిని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది? ఆ ప్రాంతం విశేషాలకు సంబంధిన ఒక వివరణాత్మక కథనం.

సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కేవలం 'లైక్స్' కోసం ఫేస్‌బుక్‌లో క్రియేట్ చేసిన ఈవెంట్ ఒకటి చాలా దూరం వరకు వెళ్లింది. ఎంత అంటే ఏకంగా యూఎస్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చేంత.

'2019,సెప్టెంబర్ 20న సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య, ' తలపెట్టిన ఆ ఈవెంట్ కోసం ఇప్పటికే 17 లక్షలకు పైగా జనాలు ఆసక్తి కనబరిచారు. ఆ ఈవెంట్ సారాంశం ఏమిటంటే.. 'Area 51 వైపు తుఫానుగా దూసుకురండి, ఏ బుల్లెట్లు మనల్ని ఏమి చేయలేవు, ఛలో గ్రహాంతవాసులను చూసేద్దాం' అని. ‘Storm Area 51, They Can’t Stop All of Us’ పేరుతో సృష్టించిన ఈ ఈవెంట్ పట్ల యూఎస్ ఆర్మీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇటు వైపు గానీ వస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో భయపడిన ఆర్గనైజర్, తాను ఏదో టైం పాస్ కోసం, లైక్స్ పెంచుకోవటానికి మాత్రమే సోషల్ మీడియాలో ఇలా ఈవెంట్ క్రియేట్ చేశానని, ఇక్కడికి జనాలు వస్తే, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన ఇచ్చుకున్నాడు. అయితే అమెరికన్స్ మాత్రం ఈ ఈవెంట్ ను సీరియస్ గా తీసుకున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటే, ఆ ప్రాంతానికే వెళ్తాం అంటూ ఒకరిని చూసి ఒకరు లక్షలాదిగా సోషల్ మీడియాలో ఒక ఉద్యమమే చేస్తున్నారు.

ఇంతకీ ఏరియా 51లో ఏముంది?

పశ్చిమ అమెరికాలోని నెవాడ రాష్ట్రం దక్షిణ భాగంలో లాస్ వేగాస్ నగరానికి 130 కి. మీ దూరంలో 'Area 51' అని పిలవబడే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని 1955 నుంచే అమెరికా వాయుసేన తమ ఆధీనంలో ఉంచుకుంది. యూఎస్ ప్రభుత్వం కూడా దీనిని ఒక నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది. నిత్యం ఈ ప్రాంతం చుట్టూ యూఎస్ ఆర్మీ పహారా, అన్ని వైపులా కెమెరాలు, నిషిద్ధ ప్రాంతం- డేంజర్ జోన్ అనే బోర్డులతో ఉంటుంది ఒక భయానక వాతావరణం కల్పించేలా ఉంటుంది ఈ ప్రాంతం. ఇటువైపు ఎవరికి అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఇటువైపు చొరబడాలని చూసినా అక్కడికక్కడే షూట్ చేసే అధికారం కూడా సైన్యం చేతిలో ఉంది. అంతటి కఠినమైన నిబంధనలు ఇక్కడ ఉన్నాయి.

దీంతో సహజంగానే అక్కడ ఏదో జరుగుతుంది అని రకరకాల ప్రచారాలు, కథనాలు అమెరికన్ ప్రజల్లో ఉన్నాయి. అయితే ఎప్పుడూ ఏ ప్రచారాన్ని అమెరికా ఖండించలేదు ఎందుకంటే, అలాగైనా అక్కడ రహస్యాలు బయటకి పొక్కకుండా జాగ్రత్తపడవచ్చు, ఏ విషయమైనా అది ప్రచారమే అని అందరిలో ఒకరకమైన భావన కల్పించాలనే ఉద్దేశ్యం.

ఈ ఏరియా 51 కాన్సెప్ట్ తో అమెరికాలో ఇప్పటికే ఎన్నో 'హారర్ - థ్రిల్లర్' నేపథ్యం గల సినిమాలు, టెలీ ఫిల్మ్స్ వచ్చాయి. యూఎస్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సైతం తమను గెలిపిస్తే 'ఏరియా 51' రహస్యాలు వెల్లడిస్తామని హామీలు ఇస్తారు అంటే ఆ ఏరియా ప్రాముఖ్యత, దానికుండే పబ్లిసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అసలు ఆ ప్రాంతానికి ఇంత ప్రచారం, ఇంత హైప్ రావటానికి కారణం ఏంటంటే కొన్ని ప్రచారాలు. అవేంటో చూడండి

1950 మధ్యకాలంలో సూర్యస్తమయ్యే సమయాన కొన్ని గుర్తు తెలియని వ్యోమ నౌకలు (Unidentified Flying Objects UFO) ఇక్కడ ఎగిరినట్లు చెప్తారు. సాయంత్రం కావడం వలన సూర్యకాంతికి అవి అత్యంత ప్రకాశవంతంగా కనిపించాయంట. అవి ఖచ్చితంగా గ్రహాంతర వాసులకు చెందినవే అని ప్రచారం ఉంది. ఆ తర్వాత యూఎస్ వాయు సేన కూడా ఆ ప్రాంతం వైపు గూఢచార విమానాలను పంపించింది. మెల్లమెల్లగా ఆ ప్రాంతాన్ని యూఎస్ ఎయిర్ ఫోర్స్ స్వాధీనం చేసేసుకుంది. అప్పట్నించే అది నిషిద్ధ ప్రాంతంగా మారింది. దీంతో అక్కడి ప్రజల్లో నిజంగానే అక్కడ గ్రహాంత వాసులు ఉన్నారని, వైమానిక దళం వారిని బంధించి వారిపై ప్రయోగాలు జరుపుతున్నారని ప్రచారం ఉంది.

అత్యంత ఎత్తులో, కాంతి సంవత్సర వేగంతో ప్రయాణించే ఏలియన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు 'రివర్స్ ఇంజినీరింగ్ టెక్నాలజీ' తో స్పేస్ క్రాఫ్ట్, యుద్ధ విమానాల తయారీకి యూఎస్ ఎయిర్ ఫోర్స్ వారిపై ప్రయోగాలు చేస్తుంది. వారి టెక్నాలజీని వాడుకొనే అమెరికా అత్యంత శక్తివంతమైన, అసాధారణ ఎత్తులో ఎగరగలిగే U2 యుద్ధ విమానాలను తయారు చేయగలిగిందనేది ప్రచారంలో ఉంది. సాధారణంగా ప్రయాణికుల కోసం ఉపయోగించే విమానాలు 20 నుంచి 35 వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి, యుద్ధ విమానాలు 40 నుంచి 50 వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి. ఈ U2 విమానాలు 70 వేల అడుగుల ఎత్తులో ఎగరగలవు.

అత్యంత శక్తివంతమైన యుద్ధ సామాగ్రి మరియు ప్రత్యర్థుల నుంచి ఎలాంటి ఆపదనుంచైనా తప్పించుకోవటానికి 'స్ట్రటీజిక్ డిఫెన్సివ్ సిస్టమ్' అభివృద్ధి చేసుకోవటానికి.

సమయంతో ప్రయాణం చేస్తూ భూత భవిష్యత్ వర్తమాన కాలాలను శాసించే విధంగా ప్రత్యేక వ్యవస్థను రహస్యంగా అభివృద్ధి పరుస్తున్నారని. ఇలా ఎన్నో రకాల కథనాలు అమెరికాలో ప్రచారంలో ఉన్నాయి.

Bruce Burgees అనబడే ఒక అమెరికన్ సినిమా డైరెక్టర్ ఈ ఏరియా 51 మీద 'డ్రీమ్ లాండ్' పేరుతో ఒక డాక్యుమెంటరీని చిత్రీకరించాడు. ఆ డాక్యుమెంటరీలో ఏరియా 51లో కొంతకాలం పనిచేసినట్లు చెప్పుకునే ఒక మెకానికల్ ఇంజనీర్ యొక్క అనుభవాలను, తన ఇంటర్వ్యూలను చూపించాడు. తనను ఏలియన్స్ ఉపయోగించే ఎగిరే డిస్క్ లను 'Flying Disc Simulator'ను నిర్మించేదుకు తన సేవలను వాడుకున్నట్లు ఆ మెకానికల్ ఇంజనీర్ చెప్పుకొచ్చాడు.

ఈ ఏరియా పట్ల యూఎస్ ప్రభుత్వ సమాచారం ఏమిటి?

యూఎస్ వైమానిక దళం తమ కార్యకలాపాలు రహస్యంగా నిర్వహించుకోవడం కోసం కేటాయించబడిన ప్రదేశం అది. అక్కడే యుద్ధ విమానాల నిర్మాణం, ప్రయోగాలు, పైలెట్లకు శిక్షణ ఇస్తారు. ఎలాంటి నిర్మాణాలు అవసరం లేకపోయినా ఆ ప్రాంతం విమానాల ల్యాండింగ్ కు అనువుగా ఉందని కాబట్టి వైమానిక దళం దానిని ఉపయోగించుకుంటుందని అధికారులు చెప్తారు. అయితే యూఎస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ ఏరియా పట్ల పూర్తి సమాచారం తెలియజేయలేదు.

అసలుకి ఆ ప్రాంతాన్ని హోమీ ఎయిర్ పోర్ట్, గ్రూమీ లేక్ అని పిలుస్తారు. అయితే ఆ ప్రాంతం ఎక్కడో తెలియకుండా ఉండేందుకు ఏరియా 51, రాంచ్, పారడైస్ రాంచ్ ఇలా వివిధ పేర్లతో యూఎస్ ఇంటెలిజెన్స్ వాడుకలోకి తెచ్చింది.