Chennai, May 4: తమిళనాడులో అభిమానం తారాస్థాయికి చేరి ఓ మహిళ తన నాలుకను కోసేసుకుంది. అభిమాన పార్టీ డీఎంకే గెలిచిందని ఓ మహిళ తన నాలుకను కోసుకుని (Woman Cuts off Her Tongue) అమ్మవారికి నైవేద్యంగా సమర్పించింది. అలా చేస్తానని ఎన్నికల ముందు మొక్కు (Sacrifice to God After MK Stalin’s Victory) తీసుకుందంట. దీనికి సంబంధించిన వివరాల్లోకెళితే.. తమిళనాడులో ఓట్ల లెక్కింపు పూర్తయి డీఎంకే 133 సీట్లు సంపాదించి ఇంకా తన మిత్రపక్షాలతో కలిసి మొత్తం 159 స్థానాలతో అధికారంలోకి వస్తోంది. దీంతో 32 ఏళ్ల వనిత తెగ సంబరపడిపోయింది.
డీఎంకే (DMK) మళ్లీ అధికారంలోకి వస్తుండడంతో సోమవారం ఉదయం వెంటనే ముత్తలమ్మాన్ అమ్మవారి ఆలయానికి వెళ్లింది. అయితే కరోనా (Coronavirus) నేపథ్యంలో ఆలయం మూసివేసి ఉండడంతో గేటు బయట నిల్చుని తన నాలుక కోసుకుంది. తెగిన నాలుకను అమ్మవారికి నైవేద్యంగా గేటు బయట పెట్టేసి వెళ్లిపోయింది. ఆమె నాలుక కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. డీఎంకే గెలవాలని.. గెలిస్తే తన నాలుక కోసుకుంటానని ముత్తలమ్మాన్ అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) శాసన సభాపక్ష సమావేశం అయింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు సమావేశమై, తమ శాసనసభాపక్ష నేతగా ఎం.కె.స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక స్టాలిన్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆ తీర్మానం ప్రతిని అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరనున్నారు. గవర్నర్ సూచన మేరకు ఈ నెల 7న రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
స్టాలిన్‌తో (Stalin) పాటు మరో 29 మంది మంత్రులుగా పదవీ ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. స్టాలిన్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చెన్నై మెరీనా బీచ్‌లోని కరుణానిధి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తానని చెప్పారు. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న డీఎంకే దళపతి స్టాలిన్‌కు తమిళనాడు సీఎం, ఏఐఏడీఎంకే సీనియర్ నేత పళనిస్వామి అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 7న జరుగనుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆమోదించినట్లు రాజ్‌భవన్ వర్గాలు సోమవారం తెలిపాయి. మధ్యాహ్నం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా పదవిలో కొనసాగాలని సీఎం పళనిస్వామిని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కోరారు. తమిళనాడు 15వ శాసనసభను గవర్నర్ రద్దు చేశారు.