Hyderabad, May 15: తెలంగాణలో కరోనావైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. జిల్లాల్లో అయితే పరిస్థితి తీవ్రంగానే ఉంది. కోవిడ్ కేంద్రాలు లేకపోవడంతో పలువురు ఇళ్లలో, బాత్ రూముల్లో, చెట్ల మీద తలదాచుకుంటున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివ అనే వ్యక్తికి చెట్టు మీద ఏర్పాటు చేసుకున్న మంచమే ఐసోలేషన్ (Covid Positive Patient Stayed On Tree) కేంద్రమైంది.
వివరాల్లోకెళితే...అతను హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. లాక్‌డౌన్ (TS Lockdown) కారణంగా గ్రామానికి వచ్చిన అతడు స్థానిక ఐకేపీ కేంద్రంలో హమాలీ పనులకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉండడం, అందరికీ ఒకటే గది కావడంతో కుటుంబ సభ్యులని ఇబ్బంది పెట్టకూడదని భావించాడు.
ఇంటి ఆవరణలోనే ఉన్న ఓ చెట్టుపై మంచె ఏర్పాటు చేసుకుని, దానిపైనే నిద్రిస్తూ, సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ, వీడియోలు చూస్తూ గడుపుతున్నాడు. మంచె మీద సరదాగా గడిచిపోతోందని, భయం దరిచేరక పోతే కరోనాతో పోరాడవచ్చని ఆ యువకుడు అందరికీ ధైర్యం చెబుతున్నాడు.
Here's Covid Positive Patient Stayed On Tree
సారు ఆశపెట్టిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు రాక కరోనా వచ్చి చెట్టు మీద ఐసోలాషన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్న రమావత్ శివ అనే యువకుడు...
ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో.. కరోనావైరస్ తన ఇంట్లోవాళ్లకు కూడా సోకకూడదు అని ఇలా షెల్టర్ ఏర్పాటుచేసుకున్నాడు...😥😥 @TelanganaCS @KTRTRS pic.twitter.com/u5ImJGqMS6
— Revanth Sainyam Telangana (@Revanth_Sainyam) May 14, 2021
ఇక వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన ద్వారా భార్యాపిల్లలకు కూడా కరోనా (Coronavirus) సోకుతుందేమోనన్న భయంతో ఓ కోవిడ్ రోగి బాత్‌రూంలో (Bathroom) తలదాచుకున్నాడు. అక్కడ నుంచి అతను మాట్లాడిన సెల్ఫీ వీడియో (Selfie Video) వైరల్ కావడంతో స్పందించిన అధికారులు అతడిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. గ్రామానికి చెందిన అశోక్ (30)కు ఐదు రోజులక్రితం కరోనా సోకింది. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన అతడు వైరస్ తన కుటుంబ సభ్యులకు కూడా సోకుతుందేమోనని భయాందోళనకు గురయ్యాడు.
దీంతో ఇంటికి కొంత దూరంలో ఉన్న బాత్‌రూంలో ఉంటున్నాడు. గురువారం ఉదయం అతడు సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో వైరల్ కావడంతో జిల్లా వైద్యాధికారులు గమనించి స్థానిక డాక్టర్, ఎంపీడీఓ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడిని అనంతగిరిగుట్టలోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అశోక్‌కు రెండు ఇళ్లు ఉన్నాయని, ఓ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటే చికిత్స అందేలా చూస్తామని చెప్పినా వినలేదని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు.