Tik Tok Trouble: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి శస్త్రచికిత్స చేసిన వీడియో టిక్‌ టాక్‌లో వైరల్, తమ ప్రమేయం లేదన్న డాక్టర్స్, విచారణ జరుపుతున్న అధికారులు
Representational image | Photo: Pixabay

అప్పట్లో ఆర్కుట్, ఆ తర్వాత ఫేస్ బుక్, ఇప్పుడు టిక్ టాక్ (Tik Tok). అవును టిక్ టాక్ ఇప్పుడు కొత్త సోషల్ మీడియా వ్యసనం. వీరు వారు అని కాదు డాక్టర్లైనా, సాఫ్ట్‌వేర్లు అయినా టిక్ టాక్ ముందుకొచ్చి కమల్ హాసన్‌ను మించిన నటన, ప్రభుదేవాను మించిన డాన్స్‌లు చేస్తూ  తమ 30 సెకన్ల టిక్ టాక్ వీడియోను ట్రెండింగ్ చేయడం కోసం యూజర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. లైక్స్ కోసం, షేర్స్ కోసం ఏవేవో పిచ్చి ప్రయోగాలు చేసి జనాలను పిచ్చెక్కిస్తున్నారు.

అయితే వీడియోని వైరల్ (Viral Video) చేయాలనుకుంటున్నప్పుడు ఆ వీడియో కంటెంట్‌కు సంబంధించి కొన్ని హద్దులు ఉంటాయి. ఏది పడితే అది సోషల్ మీడియాలో పెట్టేసి వైరల్ చేయాలనుకోవడ కరెక్ట్ కాదు. ఒక టిక్ టాక్ యూజర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేస్తున్న వీడియోను (Video of Surgery) టిక్ టాక్‌లో పెట్టడం వివాదానికి కారణమైంది.

తెలంగాణలోని హుజూరాబాద్ (Huzurabad)  ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి చేసిన శస్త్రచికిత్సకు సంబంధించిన వీడియో ఒకటి ఎవరో టిక్‌ టాక్‌లో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్ అయ్యింది. స్వయానా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ యొక్క సొంత నియోజకవర్గం అయిన హుజురాబాద్ పరిధిలోని ఆసుపత్రి నుంచి ఈ వీడియో బయటకు రావడంతో దీనిపై దర్యాప్తు మొదలైంది. అయితే వైద్యులు మాత్రం ఇందులో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

రీజినల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గతంలో ఈ ఆసుపత్రిలో అనేక శస్త్రచికిత్సలు చేశారు. వీటిపై అవగాహన కల్పించడానికి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు కొన్ని అరుదైన ఆపరేషన్ల వీడియో ఫుటేజ్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ క్రమంలో బయట వ్యక్తులు ఎవరైనా ఈ వీడియోను దుర్వినియోగం చేశారా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వీడియో టిక్‌ టాక్‌లో రావడం పట్ల తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ఈ వీడియోను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసినట్లు చెబుతున్నారు. దీనిపై విచారణ కొనసాగుతుంది.