Hyderabad, Sep 13: ఇటీవలి భారీ వర్షాలతో (Heavy Rains) అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలకు (Telugu States) మరో ముప్పు పొంచి ఉన్నది. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇరు రాష్ట్రాలు ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారనుందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే వారం, పది రోజుల్లో ఏపీ, తెలంగాణతోపాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, చత్తీస్ ఘడ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.