Tiger's Avenge:  పాము పగబడితే ఎలా ఉంటుందో కానీ, పులి పగబడితే అత్యంత క్రూరంగా ఉంటుంది. 'గాయపడ్డ పులి' అని ఎందుకు సంభోదిస్తారో ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది!
Representational Image | (Photo Credits: Unsplash)

మన తెలుగు సినిమాల్లో హీరోలను పులులు- సింహాలుగా హైలైట్ చేస్తూ రచయితలు రకరకాల డైలాగ్స్ రాస్తారు. సింహం, పులి అనే పేరు స్పురించేలా ఎన్నో సినిమా టైటిల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఉండే స్టోరీలు, రీవేంజ్ బ్యాక్‌డ్రాప్ లో ఉండే స్టోరీలు దాదాపు అవే టైటిల్స్ తో ఉంటాయి. అసలు పులులు - సింహాలతోనే మన హీరోలను ఎందుకు పోలుస్తారు అంటే ఎవరైనా యాక్షన్ హీరోలను తెరమీద ఆవిష్కరిస్తున్నపుడు పవర్‌ఫుల్ గా చూపించాలి. అడవిలో అవే పవర్‌ఫుల్. వాటి గర్జన, వాటి పంజా దెబ్బ, వేటాడటంలో అవి చూపించే తెగువ అలా ఉంటుంది మరి.

ఇప్పుడు ముఖ్యంగా పులి గురించి మాట్లాడుకుందాం. 'గాయపడ్డ పులి  పంజా విసిరితే ఎలా ఉంటుందో తెలుసా'? అనే డైలాగ్ మనం చాలాసార్లు వినే ఉంటాం. గాయపడిన పులి చేతిలో చిక్కితే చావు ఎంత క్రూరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ఈ భూమిద అత్యంత క్రూరమైన, అత్యంత పగ - ప్రతీకారాలతో రగిలిపోయే జీవి పులి. పులి తనకు ఎవరైనా గాయం చేసినా, లేదా ఇతర జంతువులు ఏవైనా దానిని ట్రాప్ చేసినట్లు అది పసిగడితే అది విడిచిపెట్టదు. అది ఆ జీవిపై తన పగను అలాగే లోపల ఉంచుకుంటుంది. తర్వాత కనిపించినపుడు ఎంత గుంపులో ఉన్నా సరే గుర్తుపెట్టుకుని మరీ వేటాడి వెంటాడి చంపితింటుంది.

ఇలాంటి సంఘటనలు మనం చాలా సార్లు విని ఉంటాం. ఒక ఉదాహరణగా ఓ పేరుపొందిన వేటగాడు పులి చేతిలో చిక్కి ఎలా ప్రాణాలు కోల్పోయాడో వివరించే సంఘటనను ఇక్కడ తెలుసుకుందాం.

రష్యాలోని (Russia) తూర్పు ఏసియా ప్రాంతంలో ఉండే అటవీప్రాంతం పులులకు ప్రసిద్ధి. వాటిని సైబీరియన్ టైగర్స్ (Siberian Tigers)  అంటారు. అచ్చం మన బెంగాల్ టైగర్ లాగే ఉంటాయి. వాటినే అమ్యూర్ టైగర్స్ (Amur Tiger) అని కూడా పిలుస్తారు. ఇవి దాదాపు 240 కిలోల బరువు, తల నుండి తోక వరకు కొలిస్తే 10 ఫీట్లు ఉంటాయి. అంటే అర్థం చేసుకోవచ్చు అవి ఎంత భారీ పరిమాణంలో, ఎంత భయంకరంగా ఉంటాయో. ఒక ఉదుటున 25 ఫీట్ల దూరం వరకు, ఎత్తువరకు దూకగలవు.

1997లో ఈ ప్రాంతంలో వ్లాదిమిర్ మార్కోవ్ (Vladimir Markov) అనే పేరొందిన వేటగాడు, పులుల వేటకు బయలుదేరాడు. అక్కడ కనిపించిన ఒక పులిని తుపాకీతో కాల్చాడు. అయితే ఆ పులి గాయపడింది, కానీ అక్కడ్నించి తప్పించుకుంది. బుల్లెట్ గాయానికి పులి శరీరంలోని కొంత భాగం అక్కడపడిపోతే, మార్కోవ్ దానిని సేకరించి అతడి దగ్గర పెట్టుకున్నాడు. ఇక అతడి పనిలో అతడు ఉన్నాడు.

కానీ వేటగాడిపై పగను పెంచుకున్న ఆ పులి అతడి కోసం కాపు కాసింది.

అడవిలో మార్కోవ్ బృందం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గుడారాన్ని అది పసిగట్టింది. అక్కడికి వెళ్లి చూడగా అతడు అక్కడలేడు. అతడు సేకరించిన పులి శరీర భాగం అక్కడే ఉంది. దానితోనే పులి ఆ గుడారాన్ని పసిగట్టింది. అతడి రాక కోసం గుమ్మం వద్దే కాపు కాసింది. దాదాపు 48 గంటలు అతడి కోసం ఎదురుచూసింది. మార్కోవ్ తన గుడారానికి చేరుకోగానే ఒక్కసారిగా అతడిపై దూకి  అత్యంత క్రూరంగా అతడిని శరీరాన్ని చీల్చి, చంపి తినేసింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇది పులి ప్రతీకారం ఇలా ఉంటుంది.