బడ్జెట్ లో వేతన జీవులకు స్వల్ప ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను రూ.75 వేలకు పెంచామన్నారు. అలాగే, కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను లేదని మంత్రి చెప్పారు.
రూ.3 లక్షలు ఆపై ఆదాయం ఆర్జించే వారికి శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తామని వివరించారు. రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారి నుంచి 30 శాతం పన్ను వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త విధానంలో వేతన జీవులు రూ.17,500 మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఇక పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న ఉద్యోగులకు అలర్ట్, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000 కుపెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటన
కొత్తపన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను ఓ సారి చూస్తే.. మూడు లక్షల వరకు ఎలాంటి పన్నూ లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారికి 5 శాతం వరకు పన్ను వర్తిస్తుంది. అదేవిధంగా రూ. 7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 10 %, రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షలు వరకు 20 %, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం మేర పన్ను వర్తించనున్నట్లు విత్త మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.