ఆత్మ విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది భారత ఆర్చర్ శీతల్ దేవి. తన వైకల్యం గురించి ఏ మాత్రం కుంగిపోకుండా తప్పక చేతులు కావాల్సిన విలువిద్యలో మూడు పతకాలతో మెరిసింది జమ్మూ కాశ్మీర్ తేజం. రెండు చేతులు తప్పక కావాల్సిన విలువిద్యలో చేతులు లేకుండానే భారత క్రీడాకారిణి శీతల్ దేవి ఆసియా పారా క్రీడల్లో పతకాల ‘హ్యాట్రిక్’ సాధించింది.కశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల ఈ టీనేజ్ ఆర్చర్‌కు రెండు చేతులు భుజాల నుంచే లేవు. శీతల్ కాళ్లతో విల్లును నిటారుగా నిలబెట్టి, నోటితో బాణాన్ని లాగిపట్టి... లక్ష్యంపై గురిపెట్టి విజయాన్ని సాధించింది.
ఈ ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో ఆమె ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇంతకుముందు మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో రజతం నెగ్గిన ఆమె రాకేశ్ కుమార్‌తో కలిసి గురువారం మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది.శుక్రవారం జరిగిన వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్ దేవి 144–142తో అలీమ్ నూర్ సియాదా (సింగపూర్)పై గెలిచింది. తద్వారా ఒకే ఆసియా పారా ఈవెంట్‌లో రెండు బంగారు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. ఇదే ఈవెంట్‌లో అంకుర్ రెండు స్వర్ణాలతో పురుష అథ్లెట్‌గా నిలిచాడు.
శుక్రవారం పారాలింపిక్ చాంపియన్ అయిన షట్లర్ ప్రమోద్ భగత్, మహిళల్లో తులస్మతి మురుగేశన్, పురుషుల డబుల్స్‌లో నితేశ్–తరుణ్ జోడీ బంగారు పతకాలు సాధించారు. ఒక్క బ్యాడ్మింటన్‌లోనే భారత్ ఖాతా లో తొమ్మిది పతకాలు చేరడం విశేషం.
చైనాలోని హాంగ్జౌలో ఆసియా పారా గేమ్స్ 2023 ముగిసాయి. కాగా ఏషియన్ గేమ్స్ 2022 పోటీల్లో 107 పతకాలతో సరికొత్త చరిత్ర లిఖించిన భారత్.. పారా గేమ్స్‌లోనూ దాన్ని బద్దలు కొట్టింది. పారా గేమ్స్ 2023లో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించిన అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. జాకార్తాలో 72 మెడల్స్ సాధించిన పారా అథ్లెట్లు, ఏషియన్ గేమ్స్, ఏషియా పారా గేమ్స్‌లో భారత్ ఖాతాలో 100కి పైగా పతకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతకుముందు 2014 ఏషియా పారా గేమ్స్‌లో 33 మెడల్స్ సాధించారు.
మొత్తంగా పథకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. చైనా 521 మెడల్స్‌తో టాప్‌లో ఉంటే ఇరాన్, జపాన్, కొరియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హాంగ్జౌలో 17 క్రీడా విభాగాల్లో 309 మంది పారా అథ్లెట్లు, ఏషియా పారా గేమ్స్‌లో పాల్గొన్నారు. ఇందులో 12 మందికి ఐదో స్థానంలో నిలిచి, తృటిలో పతకాలను మిస్ చేసుకున్నారు.