Vemuri Sudhakar Dies: తెలుగు తేజం వేమూరి సుధాకర్ కరోనాతో కన్నుమూత, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించిన సుధాకర్, సంతాపం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు
Vemuri Sudhakar (Photo-Twiiter/CM Himanta Biswa Sarma

ఆసియాతో పాటు ప్రపంచ బ్యాడ్మింటన్​ దిగ్గజ అంపైర్​గా ప్రఖ్యాతి పొందిన తెలుగు తేజం వేమూరి సుధాకర్ (Vemuri Sudhakar Dies) కరోనాతో పోరాడుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లతోపాటు (1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ) పలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో... ఆసియా క్రీడల్లో... కామన్వెల్త్‌ గేమ్స్‌లో.. థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌లలో అంపైరింగ్‌ బాధ్యతలు ( International Badminton Umpire Vemuri Sudhakar) నిర్వహించి సుధాకర్ ఖ్యాతి గడించారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో రెండు వారాలుగా కరోనా వైరస్‌తో పోరాడిన 70 ఏళ్ల సుధాకర్‌ మంగళవారం తుదిశ్వాస విడిచారు. సుధాకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ అంపైర్‌ వేమూరి సుధాకర్‌ కు నాలుగు దశాబ్దాలుగా బ్యాడ్మింటన్‌తో అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ కమిటీకి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్‌ మృతిపట్ల తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు, ఐటీ, మునిసిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌... భారత బ్యాడ్మింటన్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, డబుల్స్‌ స్టార్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, వెటరన్‌ కోచ్‌ ‘ద్రోణాచార్య’ ఎస్‌ఎం ఆరిఫ్, భారత బ్యాడ్మింటన్‌ సంఘం, ఆసియా బ్యాడ్మింటన్‌ సంఘం, భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు ఎ.జగన్‌మోహన్‌రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. అస్సాం సీఎం హిమాంత బిశ్వాస శర్మ వేమూరి సుధాకర్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Here's Assam CM Tweet

భారత బ్యాడ్మింటన్​ రంగానికి ఆయన మృతి తీరని లోటని పలువురు క్రీడా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక మ్యాచ్​లకు అంతర్జాతీయ అంపైర్​గా బాధ్యతలు నిర్వహించిన సుధాకర్ తన విలక్షణమైన పనితీరుతో కీర్తి, ప్రతిష్టలు పొందారని చెప్పారు. బ్యాడ్మింటన్​కు ఆయన అందించిన సేవలకు గాను లైఫ్ టైమ్ అచీవ్​మెంట్ అవార్డును బీడబ్ల్యూఎఫ్ఐ ప్రదానం చేసిందని తెలిపారు. ఎందరో యువ క్రీడాకారులను ప్రోత్సహించి... వారికి మార్గదర్శనం చేసిన సుధాకర్ మృతిని జీర్ణించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.