Leeds, August 27: లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్ మరియు ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. 132.2 ఓవర్లు ఆడిన ఇంగ్లీష్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 432 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా ఆ జట్టుకు భారత్ మీద 354 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో చతికిలపడిన విషయం తెలిసిందే. బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఒక్కరోజు ఆట మాత్రమే ఆడి 78 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత అదే పిచ్ పై బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు అదరగొట్టింది. కెప్టెన్ జో రూట్ సెంచరీ చేశాడు 165 బంతుల్లో 14 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. రోరీ బర్న్స్ 61 పరుగులు, హసీబ్ హమీద్ 68, మలన్ 70 పరుగులు చేసి అర్ధ సెంచరీలు సాధించారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు తీయగా బూమ్రా, రవీంద్ర జడేజా, సిరాజ్ చెరి 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.
ప్రస్తుతం ఆట మూడో రోజు కొనసాగుతోంది, ఇండియా తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి తొలి సెషన్ కూడా పూర్తి కాలేదు. అంటే ఈరోజుతో కలిపి మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో భారత బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకుంటారా? సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చేతులెత్తేసి ఇంగ్లాండ్ కు మ్యాచ్ అప్పజెప్పేస్తారా అనేది తేలాల్సి ఉంది. బ్యాట్స్‌మెన్ వికెట్లు నష్టపోకుండా పట్టుదలతో ఆడితే తప్ప ఈ మ్యాచ్ ఓటమి నుంచి టీమిండియా గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. మ్యాచ్ లైవ్ కామెంట్రీ ఈ లింక్ ద్వారా పొందండి.
స్కోర్ వివరాలు : భారత్ తొలి ఇన్నింగ్స్ 78/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 432/10
భారత్ రెండో ఇన్నింగ్స్ 7 ఓవర్లు పూర్తయ్యే సరికి 13/0 వద్ద ఉంది. క్రీజులో ఒపెనర్లు రోహిత్ శర్మ 9*, కేఎల్ రాహుల్ 5* వద్ద ఆడుతున్నారు.