India national cricket team celebrating. (Photo credits: X/@BCCI)

Mumbai, FEB 02: ఇంగ్లండ్‌, టీం ఇండియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరుగుతున్న చివరి-ఐదో టీ20 మ్యాచ్‌లో 248 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు భారత్‌ బౌలర్ల దాటికి విలవిలలాడారు. క్రీజ్‌లో నిలవలేక పోయారు. ఫలితంగా కేవలం 10.3 ఓవర్లలోనే 97 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. దీంతో 150 పరుగుల తేడాతో టీం ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. భారీ విజయ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్ 23 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 పరుగులు చేసి మెరుపులు మెరిపించినా ఉపయోగం లేకపోయింది. మరో ఓపెనర్ బెన్ డకెట్‌ డకౌట్‌ అయ్యాడు. జాకబ్‌ బెతెల్‌ పది పరుగులు చేసి శివమ్‌ దూబే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా బ్యాటర్లెవరూ క్రీజ్‌లో నిలవలేక పోయారు.

Abhishek Sharma Hits Century: టీ 20ల్లో రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 37 బాల్స్‌లో సెంచరీ పూర్తి 

సారధి జాస్‌ బట్లర్‌ కేవలం ఏడు పరుగులకు వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. హార్రీ బ్రూక్‌ రెండు, లియాం లివింగ్‌స్టోన్ తొమ్మిది పరుగులు, బ్రైడాన్‌ కార్స్‌ మూడు, అదిల్‌ రషీద్‌ ఆరు పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ దూబె, అభిషేక్ శర్మ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు.

Dominant Victory for Team India

 

అంతకు ముందు ఇంగ్లండ్‌ జట్టు ముందు టీం ఇండియా 248 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. తొలుత టాస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. భారత్‌ ఓపెనర్లు సంజూ శాంసంన్‌, అభిషేక్‌ శర్మ బ్యాటింగ్‌కు దిగినా సంజూ శాంసన్ ఏడు బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లతో 16 పరుగులు చేశాడు. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో జోఫ్రా అర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారి పట్టాడు. వన్‌ డౌన్ బ్యాటర్‌ తిలక్‌ వర్మ, సారధి సూర్య కుమార్‌ యాదవ్‌ వెంటవెంటనే ఔటయినా అభిషేక్‌ శర్మ క్రీజ్‌లో నిలుచుండి పోయాడు.

37 బంతుల్లో స్పీడ్‌గా సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్‌ శర్మ నిలకడగా ఆడి స్కోర్‌ పెంచాడు. మొత్తం 54 బంతుల్లో 135 పరుగులు చేసి అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. శివం దూబె 13 బంతుల్లో 30 పరుగులు, అక్సర్ పటేల్‌ 15 పరుగులుచేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ మూడు, మార్క్‌ వుడ్‌ రెండు, జోఫ్రా ఆర్చర్‌, జామీ ఓవర్‌టన్‌, అదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ తీశారు. తొలుత టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.