Akash Madhwal (Photo credit: Twitter @IPL)

లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఎలిమినేటర్‌లో 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసిన ఆకాశ్ మధ్వాల్‌ అందిరకీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టార్ పేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు తాను ప్రత్యామ్నాయం కాదని... తన వంతు బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తున్నానని ముంబయి ఇండియన్స్‌ సంచలన పేసర్‌ అన్నాడు.

ముంబయి నాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నేనేమి బుమ్రాకు ప్రత్యామ్నాయం కాదు. కానీ నా వంతుగా ఏం చేయగలనో అది చేస్తున్నా. లక్నొతో ఎలిమినేటర్‌లో చెపాక్‌ పిచ్‌ నుంచి పేసర్లకు పూర్తి సహకారం లేకపోయినా.. బ్యాటర్లకు దొరకని లెంగ్త్‌లో బంతిని వేసి వికెట్ల కోసం ప్రయత్నించి ఫలితం సాధించా. కెప్టెన్‌ రోహిత్‌ భాయ్‌కి నా బలమేంటో తెలుసు. నెట్స్‌లో ఎక్కువగా యార్కర్లు వేసినా..కొత్త బంతితో బౌలింగ్‌ చేయగలనని నమ్మాడు. అందుకే ఏ స్థితిలో నన్ను బరిలో దింపాలో అతడికి అవగాహన ఉందని ఆకాశ్‌ చెప్పాడు.

ముంబైతో చావోరేవో తేల్చుకోనున్న గుజరాత్, ఆ స్టార్లు ఇద్దరినీ బరిలోకి దించి విక్టరీ కొట్టాలని భారీ వ్యూహం

ఉత్తరాఖండ్‌కు చెందిన 29 ఏళ్ల మధ్వాల్‌ స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఇంటికి ఎదురింట్లోనే ఉంటాడు. రిషబ్‌కు శిక్షణ ఇచ్చిన అవతార్‌సింగ్‌ దగ్గరే క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. 2019లో ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు నెట్‌ బౌలర్‌గా సేవలందించిన మధ్వాల్‌ ఆ తర్వాత ముంబయి జట్టులో కూడా కొన్నాళ్లు అదే పాత్రలో కొనసాగాడు.

ఈ ఐపీఎల్‌ సీజన్లో స్టార్‌ పేసర్‌ ఆర్చర్‌ గాయంతో వైదొలగడంతో మధ్వాల్‌కు కలిసొచ్చింది. ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడమే కాదు ఇప్పటిదాకా 7 మ్యాచ్‌లు ఆడి 12.85 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు.