వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్ చేసేందుకు వచ్చి టైమ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించాడంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఈ విషయమై మ్యాచ్ అనంతరం స్పందించాడు. మాథ్యూస్ టైమ్ ఔట్ కోసం అప్పీల్ చేసినందుకు నాకు ఎలాంటి బాధలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. మా ఫీల్డర్‌లలో ఒకరు నా దగ్గరకు వచ్చి అప్పీల్ చేస్తే మాథ్యూస్ ఔట్ అవుతాడని తెలిపాడు. అలాగే చేశాను. అంపైర్లు నేను సీరియస్‌గా అప్పీల్ చేస్తున్నానా లేదా అని అడిగారు. అవునని చెప్పాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. రూల్స్‌లో ఉంది కాబట్టి అప్పీల్ చేశాను.
యుద్ధంలో ఉన్నప్పుడు జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాల్సి వస్తుంది. అందుకు నేనెప్పుడూ సిద్దంగా ఉంటాను. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనంటూ కామెంట్స్ చేశాడు. పైగా మాథ్యూస్‌తో వాగ్వాదం తమ గెలుపుకు కలిసొచ్చిందని అన్నాడు.