Mumbai, Dec 21: భారత మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కరోనావైరస్ కారణంగా మరొ స్నేహితుడిని కోల్పోయారు. సచిన్, వినోద్ కంబ్లితో కలిసి క్రికెట్ ఆడిన విజయ్ షిర్కే కరోనా వైరస్ కారణంగా ఆదివారం(డిసెంబర్ 20) రాత్రి థానే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విజయ్ షిర్కే (Vijay Shirke) 80వ దశకంలో సన్‌గ్రేస్ మాఫత్‌లాల్ తరఫున టెండూల్కర్, వినోద్ కాంబ్లితో కలిసి క్రికెట్ ఆడాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ విజయ్ షిర్కే వయసు 57 సంవత్సరాలు. ఇప్పటికే కోవిడ్ కారణంగా అక్టోబర్‌లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తన సన్నిహితుడు అవీ కదమ్ ని కోల్పోయాడు.
తన స్నేహితుడి మరణంపై వినోద్ కాంబ్లి స్పందించారు.." ఇది ఎంతో విషాదకరమైన వార్త. నేను నా ప్రాణ స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధాకరం. నేను, సచిన్ అతన్ని ముద్దుగా "విజ్జా" అని పిలిచేవాళ్ళం. అతను ఎప్పుడు ఉల్లాసంగా, కష్టపడి పనిచేసే వ్యక్తి" అని తాను ఆవేదన వ్యక్తం చేసాడు. విజయ్ షిర్కే మంచి ఫాస్ట్ బౌలర్. మేం ఆడుకునే రోజుల్లో చాల అద్భుతంగా బౌలింగ్ వేసేవాడు.
కొద్దీ రోజుల క్రితమే అతనితో మాట్లాడాను. మేము ప్రతిరోజూ ఒకరికొకరు మెసేజ్ ల రూపంలో 'గుడ్ మార్నింగ్' చెప్పుకుంటాం. కానీ గత మూడు-నాలుగు రోజుల నుంచి నాకు అతని నుంచి మెసేజ్ లు రావడం లేదు. ఇంతలోనే ఈ చేదువార్త వినాల్సి వచ్చింది" అని బాధ పడ్డాడు.
"మమ్మల్ని విడిచి చాలా త్వరగా వెళ్ళావు మిత్రమా. నీవు అక్కడ ప్రశాంతంగా ఉండాలి మిత్రమా. మీతో మైదానంలో, బయట గడిపిన గొప్ప సమయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము" అని భారత మాజీ పేసర్, ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ సలీల్ అంకోలా ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు.
విజయ్ షిర్కే సుంగ్రేస్ మాఫట్లాల్ లో అంకోలా యొక్క పేస్ బౌలింగ్ సహోద్యోగి. షిర్కే మరణం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ)కు మరో ఎదురు దెబ్బ. షిర్కే ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) అండర్ -17 జట్టుకు థానేలో రెండేళ్లపాటు కోచ్‌గా పనిచేశాడు. ఆయన మరణవార్త విని ప్రముఖ క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు.