తొలి మ్యాచ్ ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జోరు పెంచింది. సమష్టి ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. వాంఖెడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో (CSK vs RR IPL 2021) ధోని నాయకత్వంలోని సీఎస్‌కే 45 పరుగుల ఆధిక్యంతో (Chennai Super Kings Beat Rajasthan Royals by 45 Runs) రాజస్తాన్ రాయల్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (17 బంతుల్లో 27; 3 సిక్స్‌లు), మొయిన్ అలీ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చెయ్యి వేశారు.
అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్‌ను చెన్నై బౌలర్లు మొయిన్ అలీ (3/7), స్యామ్ కరన్ (2/24), రవీంద్ర జడేజా (2/28) కట్టడి చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా మొయిన్ అలీ నిలిచాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నుంచి దాదాపుగా బ్యాట్స్‌మెన్ అంతా బంతులను వృథా చేయకుండా వేగంగా ఆడారు. దీంతో ఓవైపు వికెట్లు పడుతున్నా చెన్నై రన్‌రేట్ తొమ్మిదికి తగ్గకుండా సాగింది. అంతకుముందు తొలి బంతికే ఓపెనర్ రుతురాజ్ (10) వికెట్‌ను కోల్పోవాల్సింది. అయితే ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోకుండా నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డుప్లెసి మాత్రం ఉనాద్కట్ ఓవర్‌లో 4,4,6,4తో చెలరేగి 19 పరుగులు రాబట్టాడు. అతడిని ఆరో ఓవర్‌లో మోరిస్ అవుట్ చేయడంతో పవర్‌ప్లేలో జట్టు 46/2తో నిలిచింది.
ఆ తర్వాత మొయిన్ అలీ (20) ఏడో ఓవర్‌లో 4,6తో బాది పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో చెన్నై కీలక బ్యాట్స్‌మెన్ రైనా, రాయుడు కదం తొక్కారు. 11వ ఓవర్‌లో చెరో సిక్స్ బాదగా.. మరుసటి ఓవర్‌లో రాయుడు వరుసగా రెండు సిక్సర్లతో సత్తా చూపాడు. నాలుగో వికెట్‌కు 24 బంతుల్లో 45 పరుగులు అందాక ఒకే ఓవర్‌లో సకారియా ఈ ఇద్దరిని అవుట్ చేశాడు.
ధోనీ (18) రెండు ఫోర్లతో కుదురుకున్నట్టే కనిపించినా సకారియా స్లో బాల్‌కు దొరికిపోయాడు. 19వ ఓవర్‌లో జడేజా (8) అవుటైనా చెన్నై 15 పరుగులు సాధించింది. చివరి ఓవర్‌లో సామ్ కర్రాన్ (13), శార్దూల్ (1) రనౌట్స్ అయినా బ్రావో సిక్సర్‌తో 15 రన్స్ రాబట్టిన జట్టు 190కి చేరువైంది. ఆఖరి 5 ఓవర్లలో చెన్నై 62 పరుగులు సాధించింది.
లక్ష్య ఛేదనలో రాజస్తాన్ రాయల్స్‌ను స్యామ్ కరన్ దెబ్బ కొట్టాడు. తన వరుస ఓవర్లలో మనన్ వోహ్రా (14), కెప్టెన్ సామ్సన్ (1)లను అవుట్ చేసి చెన్నైకి శుభారంభం చేశాడు. మరో ఎండ్‌లో బట్లర్ బౌండరీలు బాదేస్తూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా... అతనికి శివమ్ దూబే (17; 2 ఫోర్లు) సహకరించాడు. దాంతో రాజస్తాన్ 10 ఓవర్లు ముగిసేసరికి 81/2గా నిలిచింది. 12వ ఓవర్ వేసిన జడేజా... మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గుడ్‌లెంగ్త్ బాల్‌తో బట్లర్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు.
అదే ఓవర్ చివరి బంతికి దూబేను ఎల్బీగా అవుట్ చేసి మ్యాచ్‌ను సీఎస్‌కే వైపు తిప్పాడు. ఆ తర్వాత ఆశలు పెట్టుకున్న మిల్లర్ (2), పరాగ్ (3), మోరిస్ (0)లను మొయిన్ అలీ అవుట్ చేయడంతో... ఒకదశలో 87/2గా ఉన్న రాజస్తాన్ 8 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయి 95/7గా నిలిచింది. చివర్లో తెవాటియా (20; 2 సిక్స్‌లు), ఉనాద్కట్ (24; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా ఫలితం లేకపోయింది.
స్కోరు వివరాలు : చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) శివమ్ దూబే (బి) ముస్తఫిజుర్ 10; డు ప్లెసిస్ (సి) పరాగ్ (బి) మోరిస్ 33; మొయిన్ అలీ (సి) పరాగ్ (బి) తెవాటియా 26; రైనా (సి) మోరిస్ (బి) సకారియా 18; రాయుడు (సి) పరాగ్ (బి) సకారియా 27; జడేజా (సి) సామ్సన్ (బి) మోరిస్ 8; ధోని (సి) బట్లర్ (బి) సకారియా 18; స్యామ్ కరన్ (రనౌట్) 13; బ్రావో (నాటౌట్) 20; శార్దుల్ ఠాకూర్ (రనౌట్) 1; దీపక్ చహర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188.
వికెట్ల పతనం: 1–25, 2–45, 3–78, 4–123, 5–125, 6–147, 7–163, 8–174, 9–180.
బౌలింగ్: జైదేవ్ ఉనాద్కట్ 4–0–40–0; చేతన్ సకారియా 4–0–36–3; ముస్తఫిజుర్ 4–0–37–1; మోరిస్ 4–0–33–2; రాహుల్ తెవాటియా 3–0–21–1; రియాన్ పరాగ్ 1–0–16–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (బి) జడేజా 49; మనన్ వొహ్రా (సి) జడేజా (బి) స్యామ్ కరన్ 14; సామ్సన్ (సి) బ్రావో (బి) స్యామ్ కరన్ 1; శివమ్ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 17; మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మొయిన్ అలీ 2; పరాగ్ (సి) జడేజా (బి) మొయిన్ అలీ 3; తెవాటియా (సి) రుతురాజ్ (బి) బ్రావో 20; మోరిస్ (సి) జడేజా (బి) మొయిన్ అలీ 0; ఉనాద్కట్ (సి) జడేజా (బి) శార్దుల్ ఠాకూర్ 24; సకారియా (నాటౌట్) 0; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు) 143.
వికెట్ల పతనం: 1–30, 2–45, 3–87, 4–90, 5–92, 6–95, 7–95, 8–137, 9–143.
బౌలింగ్: దీపక్ చహర్ 3–0–32–0; స్యామ్ కరన్ 4–0–24–2; శార్దుల్ ఠాకూర్ 3–0–20–1; జడేజా 4–0–28–2; బ్రావో 3–0–28–1; మొయిన్ అలీ 3–0–7–3.