SRH vs DC Highlights: బ్యాట్‌తో దంచి కొట్టి, బాల్‌తో భయపెట్టి దిల్లీ క్యాపిటల్స్‌ను ఉతికారేసిన సన్ రైజర్స్ హైదరాబాద్, 88 పరుగుల తేడాతో ఘన విజయం; ఈరోజు ముంబై- బెంగళూరు మధ్య కీలక పోరు
David Warner And Rashid Khan (Photo Credits: Twitter)

SRH vs DC Stat Highlights: గెలవక తప్పని మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి చెలరేగి ఆడింది. మొదట బ్యాటింగ్ తో గర్జించింది, ఆపై బౌలింగ్ తో ప్రత్యర్థిని వేటాడింది ఫలితంగా ప్లేఆఫ్ కు అడుగు దూరంలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ ను ఆ అడుగు వేయకుండా అడ్డుకుంది.

ఇక్కడ దుబాయ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. అది ఎంతపెద్ద తప్పో దిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు కొద్దిసేపట్లోనే తెలిసిపోయింది. బర్త్ డే బోయ్ డేవిడ్ వార్నర్, మరో ఒపెనర్ వృద్ధిమాన్ సాహా ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. క్రీజులో ఉన్న వార్నర్ ఆటను చూస్తే ఆకలితో ఉన్న పులి జింకను వేటాడుతున్నట్లు వార్నర్ ప్రతిబంతిని వేటాడుతున్నట్లే అనిపించింది. దాదాపు 200 స్ట్రయిక్ రేట్ కొనసాగించిన వార్నర్ 34 బంతుల్లో 2 సిక్సర్లు, 8 ఫోర్లతో 66 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వార్నర్ ఔట్ అయినా, సాహా ఆ జోరు కొనసాగించాడు 45 బంతుల్లో 2 సిక్సర్లు, 12 ఫోర్లతో 87 పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత చివరి ఓవర్లలో స్కోర్ వేగం కొంత నెమ్మదించింది, అయినప్పటికీ SRH నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 219 పరుగుల భారీస్కోర్ సాధించింది.

ఆ తర్వాత 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్ ఆది నుంచి తడబడ్డారు. SRH బౌలర్లు సంధించిన బంతులకు విలవిలలాడిపోయారు. వరుసగా వికెట్లు చేజార్చుకుంటూ చేతులెత్తేశారు. 4 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో దిల్లీ క్యాపిటల్స్ ను కోలుకోలేని దెబ్బతీసినట్లయింది. సందీప్ శర్మ, నటరాజన్ లు కూడా చెరి 2 వికెట్లు పడగొట్టారు. SRH బౌలర్ల ధాటికి DC 19 ఓవర్లకే 131 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. హైదరాబాద్ 88 పరుగుల ఘనవిజయం సాధించింది. 87 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

ప్లేఆఫ్ కు అర్హత సాధించేందుకు కేవలం ఒక్క గెలుపు దూరంలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ కు ఇది వరుసగా మూడో పరాజయం కాగా, ప్లేఆఫ్ ఆశలను ఇంకా సజీవంగా ఉంచుకుంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన 12 మ్యాచ్ లలో 5వ విజయాన్ని నమోదుచేసింది.

కాగా, ఈరోజు అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.