David Warner of Sunrisers Hyderabad (Photo Credits: IANS)

Hyderabad, Febuary 27: మండు వేసవిలో, మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 (IPL 20200 సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ (Sunrisers Hyderabad) అనూహ్య నిర్ణయం తీసుకుంది. జట్టు సారథ్య బాధ్యతలను మరోసారి డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు (David warner) అప్పగిస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో గత రెండు సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేన్ విలియమ్సన్ స్థానంలో వార్నర్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు.

ఇప్పుడు 2018, 2019 ఐపీఎల్‌ సీజన్లకు నాయకత్వం వహించిన కేన్‌ విలియమ్‌సన్‌ (Kane Williamson) స్థానంలో వార్నర్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టునున్నాడు. ఇదే విషయాన్ని దృవీకరిస్తూ సన్‌రైజర్స్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో వార్నర్‌నుద్ధేశించి వీడియో పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా వార్నర్‌ స్పందిస్తూ.. ' నా మీద నమ్మకంతో జట్టు యాజమాన్యం మరోసారి తనను కెప్టెన్‌గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్‌ 2020లో సన్‌రైజర్స్‌కు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నా. 2018 ఐపీఎల్‌ సీజన్‌కు నేను అందుబాటులో లేనప్పుడు కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన కేన్‌ విలియమ్‌సన్‌తో పాటు భువనేశ్వర్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా.

Here's SunRisers Hyderabad Tweet

మరోసారి కెప్టెన్‌గా జట్టును ముందుండి నడుపుతున్నా.. అందుకు మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నా. నాపై నమ్మకంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరోసారి నన్ను కెప్టెన్‌ను చేసింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జట్టును ముందుకు నడుపుతా. తనకు ఇంతకాలం మద్దతుగా ఉన్న సన్‌రైజర్స్‌ అభిమానులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా' అంటూ తెలిపాడు.

బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్న వార్నర్‌, స్టీవ్ స్మిత్‌లను.. బీసీసీఐ కూడా ఒక సీజన్ ఆడనివ్వకుండా నిషేధం విధించింది. దీంతో వార్నర్, స్మిత్ ఐపీఎల్ 2018 సీజన్‌కు దూరమయ్యారు. అప్పట్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న డేవిడ్ వార్నర్‌కి.. తాజాగా మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పగ్గాలు అప్పగించింది.

2018లో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నర్‌తో పాటు అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై ఏడాది నిషేదం, బౌలర్‌ బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేదం విధించిన తరువాత మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో 2018 ఐపీఎల్‌ సీజన్‌కు కేన్‌విలియమ్‌సన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

2019లో పునరాగమనం తర్వాత వార్నర్‌ ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ఒక ఆటగాడిగా కొనసాగుతూ తన ప్రదర్శనతో దుమ్మురేపాడు. మొత్తం 12 మ్యాచుల్లో 692 పరుగులు సాధించి లీగ్‌ టాపర్‌గా నిలవడం విశేషం. అందులో ఒక శతకం, 8 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా ఇంతకుముందు వార్నర్‌ నాయకత్వంలోనే 2016లో సన్‌రైజర్స్‌ జట్టు టైటిల్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.