Virat Kohli (RCB) and Shreyas Iyer (DC) (Photo Credits: PTI)

అబుదాబి వేదికగా దిల్లీ క్యాపిటల్స్ మరియు రాయల్స్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన కీలకపోరులో దిల్లీ క్యాపిటల్స్ పైచేయి సాధించి ప్లేఆఫ్ లో బెర్త్ సాధించింది. ముంబై తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఇక బెంగళూరు ఈ మ్యాచ్ లోనూ ఓడి, ప్లే ఆఫ్ కు ముందు వరుసగా 4 ఓటములను నమోదు చేసింది. అయినప్పటికీ మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు కూడా ప్లేఆఫ్ కు చేరిన జట్టుగా మూడో స్థానంలో నిలిచింది. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే నాలుగో స్థానంలో ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.

సోమవారం జరిగిన మ్యాచ్ బెంగళూరుకు కొంచెం ఇష్టం - కొంచెం కష్టంలా సాగింది. దిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది అయితే ఒకవేళ దిల్లీ క్యాపిటల్స్ 17.3 ఓవర్ లోపు సాధించి ఉంటే బెంగళూరు ప్లేఆఫ్ కు వెళ్లేది కాదు, కోల్ కతాతో సమానంగా నిలిచేది, మరోవైపు బెంగళూరు గనక ఈ మ్యాచ్ గెలిచి ఉంటే రెండో స్థానంలోకి వెళ్లేది, దీంతో ప్లే ఆఫ్ లో ఒక మ్యాచ్ ఓడినా ఫైనల్ కు వెళ్లేందుకు మరొక అవకాశం ఉండేది, ఇప్పుడు ఆ ఛాన్స్ ను రెండో స్థానంలోకి వచ్చిన దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు బెంగళూరు 7 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది, 153 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ 19 ఓవర్లలో 154 పరుగులు చేసింది.

మంగళవారం షార్జా వేదికగా ముంబై - హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ తో ముంబైకి ఏం అంత అవసరం లేకపోయినా, హైదరాబాద్ కు మాత్రం అత్యంత కీలకం SRH గెలిస్తే మెరుగైన రన్ రేట్ కారణంగా నేరుగా నాలుగో స్థానంలో ప్లే ఆఫ్ కు వెళ్తుంది, ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరుతో తలపడుతుంది. ఒకవేళ SRH ఓడిపోతే మాత్రం ఇంటిబాట పట్టాల్సిందే నాలుగో స్థానంలో కోల్ కతా ఇప్పటికే ఉంది. కాబట్టి అది ప్లేఆఫ్ కు క్వాలిఫై అయిపోతుంది.