ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో బోణీ కొట్టింది. ఐదు ఓటముల అనంతరం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వార్నర్ సేన గురువారం జరిగిన రెండో పోరులో 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది.మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన జాసెన్ రాయ్ (43; 5 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. ఆఖర్లో రస్సెల్ (38 నాటౌట్; ఒక ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, నోర్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు కోల్పోయి 128 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 57; 11 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. పృథ్వీ షా (13), మిషెల్ మార్ష్ (2), ఫిల్ సాల్ట్ (5) విఫలమయ్యారు. ఆఖర్లో మనీశ్ పాండే (21), అక్షర్ (19 నాటౌట్) పోరాడారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, నితీశ్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు.