Jonny Bairstow (Twitter/England Cricket)

ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ అద్భుతం చేసింది. ఆ జట్టు ఆటగాడు జానీ బెయిర్ స్టో (92 బంతుల్లో 136.. 14 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ కు రెండో టెస్టులో విజయంతో పాటు సిరీస్ ను కూడా సాధించిపెట్టాడు. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 75 నాటౌట్.. 10 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా ఓ చేయి వేసి తన కెప్టెన్సీ కెరీర్ లో ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ను గెలుచుకున్నాడు. లార్డ్స్ లో జరిగిన తొలి టెస్టులో కూడా ఇంగ్లాండ్ గెలిచిన విషయం తెలిసిందే.

299 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఇక డ్రా ఖామమనుకున్నారంతా. కానీ క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ట్‌ స్టో తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతాడని బహుశా అప్పుడు ఎవరు ఊహించి ఉండరు. చూస్తుండగానే ఫిఫ్టీ.. ఆపై సెంచరీ.. ఓవరాల్‌గా 92 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 136 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. గాలికి అగ్ని తోడయినట్లు.. కెప్టెన్‌ స్టోక్స్‌ 70 బంతుల్లో 75 నాటౌట్‌.. రెచ్చిపోవడంతో ఇంగ్లండ్‌ సంచలన విజయం సాధించింది. 70 ఓవర్లు జరగాల్సిన మ్యాచ్‌ వీరిద్దరి విధ్వంసానికి 50 ఓవర్లలోనే ముగిసిపోయింది.