ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించగలరా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీ బీసీసీఐని కోరింది. అయితే ఇందుకు నెల రోజులు సమయం్ కావాలని బీసీసీఐ కోరింది. టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలన్న బీసీసీఐ (BCCI) విజ్ఞప్తిని ఎట్టకేలకు ఐసీసీ అంగీకరించింది. దీంతో ఈనెల 28 వరకు గడువు లభించింది.
ఆలోగా ఈ టోర్నీ (ICC T20 World Cup 2021) ఆతిథ్యంపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దేశంలో కరోనావైరస్ (Coronavirus) ఇంకా భారీగానే ఉండడంతో ఏం చేయాలనే విషయంలో బోర్డు ఆచితూచి వ్యవహరించాలనుకుంటోంది. మంగళవారం వర్చువల్‌గా జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు. ఇందులో బీసీసీఐ అభ్యర్థనను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో భారత బోర్డు విజ్ఞప్తి మేరకు ఐసీసీ (ICC) మరో నెల రోజులు గడువిచ్చింది. దీనిపై బీసీసీఐ నుంచి స్పందన వచ్చిన తర్వాత జూన్ 28న తర్వాత జరిగే తమ సమావేశంలో ఐసీసీ అధికారికంగా వరల్డ్‌కప్ వివరాలను ప్రకటిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లలో భారత్‌లో టోర్నీ జరగాల్సి ఉంది. అలాగే దేశంలో ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర నివేదిక అందించాలన్నారు.
ఇదిలావుండగా 2024-2031 క్రికెట్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీ ప్రకటించింది. ఈమేరకు వన్డే వరల్డ్‌కప్‌లో 14 జట్లు, టీ20 వరల్డ్‌కప్‌లో 20 జట్లు పాల్గొననున్నాయి. 2025, 2029లో 8 జట్లతో కూడిన చాంపియన్‌షిప్ ట్రోఫీని తిరిగి ఆడించనున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో నాలుగు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లు జరుగుతాయి. ప్రత్యామ్నాయంగా యూఏఈ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం ఉంటే మాత్రం ఈ టోర్నీ యూఏఈలో జరుగుతుంది. అయితే ఆతిథ్య హక్కులు మాత్రం భారత్‌కే ఉండే అవకాశం ఉంది. బీసీసీఐ మాత్రం టీ20 ప్రపంచక్‌పను భారత్‌లో జరిపేందుకే మొగ్గు చూపిస్తోంది. అందుకే వచ్చే ఏడాది ఫిబ్రవరి విండో కోసం చూస్తోంది. కానీ అదే సమయంలో మహిళల వన్డే వరల్డ్‌కప్ ఉంటుంది కాబట్టి అది సాధ్యం కాకపోవచ్చు.
దేశంలోని తాజా పరిస్థితులు, అక్టోబర్ సమయంలో కరోనా మూడో వేవ్ రావచ్చనే అంచనాల నేపథ్యంలో బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. వేదికలు, 16 జట్లకు సాధారణ ఏర్పాట్లతో పాటు బయో బబుల్ కట్టుబాట్లు, అభిమానులను అనుమతించే విషయాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 900 కోట్ల రాయితీ పొందడం తదితర అంశాలపై పూర్తి వివరాలతో ఐసీసీకి బీసీసీఐ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. భారత్‌లో సాధ్యం కాదని తేలితే వరల్డ్‌కప్ ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈ, ఒమన్‌లను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే వేదిక ఏదైనా నిర్వహణ ఏర్పాట్లు మాత్రమే బీసీసీఐనే చూస్తుంది.
ఇప్పటివరకు 8 జట్లు, 10 జట్లతో నిర్వహించిన పురుషుల వన్డే ప్రపంచకప్ ఇకపై 14 జట్లతో నిర్వహించున్నారు. 2027 ప్రపంచకప్ నుంచి ఈ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి సిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ నేడు అధికారిక ప్రకటన చేసింది. 2027, 2031 ప్రపంచకప్ టోర్నీల్లో 14 జట్లు పోటీపడతాయని, మొత్తం జట్లు కలిపి 54 మ్యాచ్‌లు ఆడతాయని తెలిపింది. అంతేకాకుండా 2024, 2026, 2028, 2030 ప్రపంచకప్ ఎడిషన్లలో 20 జట్ల చొప్పున పాల్గొంటాయని, ప్రతి టోర్నీలోనూ 55 మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించింది.