Zimbabwe-vs-Pakistan (Photo-Twitter(

టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ కు జింబాబ్వే చుక్కలు చూపించింది. మొదట బ్యాటింగ్ చేసి తక్కువ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్ లో  అదరగొట్టింది. పాక్ బ్యాటర్లు పరుగులు  తీయడానికి నానా అవస్థలు పడ్డారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. 1 పరుగు తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. దాయాది దేశం రెండవ ఓటమిని మూటగట్టుకుని సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది.

కాగా జింబాబ్వేతో మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్లు రాణించారు. పెర్త్ లో జింబాబ్వేను తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. ఈ మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. జింబాబ్వే ఇన్నింగ్స్ లో షాన్ విలియమ్స్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో పేసర్ మహమద్ వాసిమ్ జూనియర్ 4 వికెట్లు తీయగా, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశాడు. పాక్ కొత్త బంతి బౌలర్లు షహీన్ అఫ్రిది, నసీమ్ షా ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్టు కూడా తీయలేకపోయారు.

ప్రపంచకప్‌లో రెండో విజయం నమోదు చేసిన భారత్, నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా

అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు జింబాబ్వే బౌలర్లు చుక్కలు చూపించారు. సూపర్ 12 ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్ బాబర్ ఆజం 4 పరుగులకే తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. అతని అవుట్ అయిన కొద్దిసేపటికే బ్లెస్సింగ్ ముజారబానీ 14 పరుగుల వద్ద మహ్మద్ రిజ్వాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇఫ్తికర్ అహ్మద్ కూడా 5 పరుగులకే పడిపోయాడు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన హైదర్ ఆలీ పరుగులేమి చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆది నుంచి పోరాడుతూ క్రీజులో నిలిచిన షాన్ మసూద్ 44 పరుగుల వద్ద స్టంప్ ఔట్ గా వెనుదిరిగాడు. అనంతరం స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లిన నవాజ్ 22 పరుగుల వద్ద అవుటయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా పాక్ బ్యాటర్ రనౌట్ అయ్యారు. దీంతో జింబాబ్వే 1 పరుగు తేడాతో  విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా మూడు వికెట్లు తీయగా ల్యూక్ జాంగ్వే ఒక వికెట్ తీశాడు.