Indian women's team players celebrate a wicket (Photo credit: Twitter @BCCIWomen)

ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో (ICC Women's T20 World Cup 2023) నేరుగా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన గ్రూప్‌–2 చివరి లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ (India ) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (56 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి స్కోరు బోర్డు పరుగులు పెట్టడంలో కీలక పాత్ర పోషించింది.

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ (Ireland) 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించిన సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.వర్షం తగ్గకపోవడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లలో ఐర్లాండ్‌ విజయసమీకరణం 59 పరుగులుగా ఉంది. అయితే ఆ జట్టు ఐదు పరుగులు వెనుకపడి ఉండటంతో భారత విజయం ఖరారైంది.

కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాక్.. వైస్ కెప్టెన్సీ నుంచి తొలగింపు

ఈ గెలుపుతో భారత్‌ ఆరు పాయింట్లతో గ్రూప్‌–2లో రెండో స్థానంతో సెమీఫైనల్‌ చేరింది. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, గ్రూప్‌–1 టాపర్‌ ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడుతుంది. మహిళల క్రికెట్‌లో ప్రపంచనెంబర్‌వన్‌గా ఉన్న బలమైన ఆస్ట్రేలియాను ఓడించాలంటే టీమిండియా వుమెన్స్‌ శక్తికి మించి రాణించాల్సిందే.ఆసీస్‌ను సెమీస్‌లో భారత్‌ నిలువరించగలిగితే ఈసారి కప్‌ కొట్టడం ఖాయం అని పలువురు జోస్యం చెబుతున్నారు. ఫిబ్రవరి 23న భారత్-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

విరాట్ కోహ్లీ పెదాలపై ముద్దు పెట్టిన అమ్మడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇక పాకిస్తాన్‌తో నేడు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్న ఇంగ్లండ్‌ ఆరు పాయింట్లతో ఇప్పటికే గ్రూప్‌–2 నుంచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రన్‌రేట్‌ పరంగా భారత్‌ (0.253) కంటే ఇంగ్లండ్‌ (1.776) మెరుగ్గా ఉంది. ఒకవేళ నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓడిపోయినా గ్రూప్‌–2లో ఆ జట్టే ‘టాప్‌’లో నిలుస్తుంది. గ్రూప్‌–2 టాపర్‌ హోదాలో ఇంగ్లండ్‌ శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్‌–1లో రెండో స్థానంలో నిలిచే అవకాశమున్న న్యూజిలాండ్‌ లేదా దక్షిణాఫ్రికాతో ఆడుతుంది.