David Miller(Photo credit: Twitter)

ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. స్టార్‌ క్రికెటర్ల గైర్హాజరీ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తమ గెలుపు జోరును కొనసాగించలేకపోయింది. గురువారం ఆఖరి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0తో ముందంజ వేశారు. గెలిచి టీ20ల్లో అత్యధిక(13) విజయాల రికార్డును సొంతం చేసుకుందామనుకున్న టీమ్‌ఇండియా ఆశలు నెరవేరలేకపోగా, టీ20ల్లో సఫారీలు తమ అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు.

తొలుత ఇషాన్‌కిషన్‌(48 బంతుల్లో 76, 11ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయాస్‌ అయ్యర్‌(36), హార్దిక్‌పాండ్యా(12 బంతుల్లో 31 నాటౌట్‌, 2ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో భారత్‌ 20 ఓవర్లలో 211/4 స్కోరు చేసింది. మహారాజ్‌, నోర్టె, పార్నెల్‌, ప్రిటోరియస్‌ ఒక్కో వికెట్‌ తీశారు. లక్ష్యఛేదనలో సఫారీలకు అనుకున్న రీతిలో శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ బవుమా(10) ఆదిలోనే నిష్క్రమించాడు. మూడో డౌన్‌లో వచ్చిన ప్రిటోరియస్‌(29) వచ్చి రావడంతోనే విరుచుకుపడ్డాడు. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో మూడు భారీ సిక్స్‌లతో చెలరేగాడు. ఈ క్రమంలో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. 20 పరుగుల తేడాతో ప్రిటోరియస్‌, డికాక్‌(22) ఔట్‌ అయ్యారు.

అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

ఈ క్రమంలో మిల్లర్‌, డస్సెన్‌ మ్యాచ్‌ స్వరూపానే మార్చేశారు. తన ఐపీఎల్‌ సూపర్‌ ఫామ్‌ను మిల్లర్‌ కొనసాగిస్తూ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించుకుంటూ పోయాడు. ఎదురైన బౌలర్‌నల్లా చితకబాదడంతో లక్ష్యం చేరువైంది. వీరిద్దరి బౌండరీల హోరుతో స్టేడియం హోరెత్తిపోయింది. మిల్లర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం కటక్‌లో జరుగనుంది.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌: 20 ఓవర్లలో (కిషన్‌ 76, అయ్యర్‌ 36, పార్నెల్‌ 1/32, ప్రిటోరియస్‌ 1/35), దక్షిణాఫ్రికా: 19.1 ఓవర్లలో 212/3 (డస్సెన్‌ 75 నాటౌట్‌, మిల్లర్‌ 64 నాటౌట్‌, అక్షర్‌ పటేల్‌ 1/40, భువనేశ్వర్‌ 1/43)