T20 World Cup 2021: సెమీస్ ఆశలతో..అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం, 66 పరుగుల తేడాతో చిత్తయిన అఫ్ఘానిస్థాన్‌, తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడనున్న భారత్
Indian Cricket Team. (Photo Credits: Twitter@imVkohli)

నాకౌట్‌ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజృంభించింది. టీ20 వరల్డ్‌క్‌ప్‌లో (T20 World Cup 2021) టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో.. బోణీ చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోహిత్‌ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. గ్రూప్‌-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో (India Registers 66-Run Win) చిత్తు చేసింది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (47 బంతుల్లో 74; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ (48 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 35 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్‌ పంత్‌ (13 బంతుల్లో 27; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. అఫ్గాన్‌ బౌలర్లలో నైబ్‌, కరీం చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్‌ మహమ్మద్‌ నబీ (35), కరీం జనత్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కాస్త పోరాడారు. నాలుగేండ్ల విరామం తర్వాత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న భారత సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి 2 వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్‌ షమీ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్‌శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇక శుక్రవారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో భారత్‌ తలపడనుంది.

స్కోరు బోర్డు

భారత్‌: రాహుల్‌ (బి) నైబ్‌ 69, రోహిత్‌ (సి) నైబ్‌ (బి) కరీం 74, పంత్‌ (నాటౌట్‌) 27, హార్దిక్‌ (నాటౌట్‌) 35, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 210/2. వికెట్ల పతనం: 1-140, 2-147, బౌలింగ్‌: నబీ 1-0-7-0, షర్ఫుద్దీన్‌ 2-0-25-0, నవీన్‌ 4-0-59-0, హమీద్‌ 4-0-34-0, నైబ్‌ 4-0-39-1, రషీద్‌ 4-0-36-0, కరీం 1-0-7-1.

అఫ్గానిస్థాన్‌: హజ్రతుల్లా (సి) శార్దూల్‌ (బి) బుమ్రా 13, షహజాద్‌ (సి) అశ్విన్‌ (బి) షమీ 0, రహ్మానుల్లా (సి) హార్దిక్‌ (బి) జడేజా 19, నైబ్‌ (ఎల్బీ) అశ్విన్‌ 18, నజీబుల్లా (బి) అశ్విన్‌ 11, నబీ (సి) జడేజా (బి) షమీ 35, కరీం (నాటౌట్‌) 42, రషీద్‌ (సి) హార్దిక్‌ (బి) షమీ 0, షర్ఫుద్దీన్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 144/7. వికెట్ల పతనం: 1-13, 2-13, 3-48, 4-59, 5-69, 6-126, 7-127, బౌలింగ్‌: షమీ 4-0-32-3, బుమ్రా 4-0-25-1, హార్దిక్‌ 2-0-23-0, జడేజా 3-0-19-1, అశ్విన్‌ 4-0-14-2, శార్దూల్‌ 3-0-31-0.