IND vs SL 1st ODI Stat Highlights: ఔరా..తొలి బంతికే సిక్స్, ఆడిన తొలి మ్యాచ్‌లో అదరహో అనిపించిన ఇషాన్‌ కిషన్‌, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం
Wicketkeeper-batsman Ishan Kishan (Photo/ ICC Twitter)

శ్రీలకంతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చలాయించింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘనవిజయం (IND vs SL 1st ODI Stat Highlights) సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక ఇన్నింగ్స్‌ నిలకడగా సాగింది. అవిష్క ఫెర్నాండో (35 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌), మినోద్‌ భానుక (44 బంతుల్లో 27; 3 ఫోర్లు) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 10వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన చహల్‌ భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. దాంతో 49 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్‌ను కోల్పోయింది. స్పిన్నర్ల రాకతో శ్రీలంక స్కోరు బోర్డు వేగం మందగించింది. ఒకదశలో 205/7గా నిలిచిన శ్రీలంక 250 మార్కును దాటడం కష్టంగా అనిపించింది. అయితే 8వ స్థానంలో వచ్చిన కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్‌; ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి లంకకు గౌరవప్రద స్కోరు అందించాడు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక 32 పరుగులు రాబట్టింది.

లక్ష్యఛేదనలో భారత్‌ 36.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అజేయ అర్ధ సెంచరీ (95 బంతుల్లో 86 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ‘బర్త్‌డే బాయ్‌’ వన్డేల్లో అరంగేట్రం చేసిన ఇషాన్‌ కిషన్‌ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పృథ్వీ షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) మెరుపులు మెరిపించారు.

సంజు శాంసన్ గాయంతో వన్డే అరంగేట్రానికి అవకాశం దక్కించుకున్న వికేట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌.. తొలి మ్యాచ్‌లోనే (shan Kishan Shines in India’s Win) సత్తా చాటాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌ను విజయంతో శుభారంభం చేసిన భారత యువ జట్టులో ఇషాన్‌ మూడో స్థానంలో బరిలోకి దిగాడు. తన కంటే ముందు పృథ్వీ షా పారించిన పరుగుల వరదను నిరాటంకంగా కొనసాగించాడు. తొలి బంతిని స్టాండ్స్‌లోకి.. తర్వాత బంతిని బౌండరీలోకి బాది క్రీజులో కుదురుకున్నాడు.

ఆట అనంతరం చాహల్‌తో కలిసి ‘చాహల్‌ టీవీ’తో మాట్లాడిన ఇషాన్‌.. తొలి బంతినే సిక్స్‌గా మలచడం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాడు. 50 ఓవర్లపాటు కీపింగ్‌ చేసిన తనకు పిచ్‌ స్పిన్నర్లకు సహకరించడంలేదన్న విషయం బోధపడిందని తెలిపాడు. దీన్ని సదవకాశంగా భావించానన్నాడు. దీంతో బౌలర్‌ తొలి బంతిని ఎక్కడ వేసినా.. దాన్ని సిక్స్‌గా మలచాలని ముందే నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని డ్రెస్సింగ్‌ రూంలో ఆటగాళ్లతో ముందే చెప్పినట్లు వెల్లడించాడు. పైగా ఆదివారం తన పుట్టినరోజు కూడా అని తెలిపాడు. ఈ అంశాలన్నీ తొలి బంతిని సిక్స్‌గా మలచడానికి కారణాలుగా చూడొచ్చని ఇషాన్‌ తెలిపాడు. ఇషాన్‌ టీ20 అరంగేట్ర మ్యాచ్‌లోనూ తొలి బంతికి సిక్స్‌ బాదడం విశేషం.

స్కోరు వివరాలు

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (సి) పాండే (బి) చహల్‌ 32; మినోద్‌ భానుక (సి) పృథ్వీ షా (బి) కుల్దీప్‌ యాదవ్‌ 27; రాజపక్స (సి) ధావన్‌ (బి) కుల్దీప్‌ యాదవ్‌ 24; ధనంజయ (సి) భువనేశ్వర్‌ (బి) కృనాల్‌ పాండ్యా 14; అసలంక (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) దీపక్‌ చహర్‌ 38; షనక (సి) హార్దిక్‌ (బి) చహల్‌ 39; హసరంగ (సి) ధావన్‌ (బి) దీపక్‌ చహర్‌ 8; కరుణరత్నే (నాటౌట్‌) 43; ఉదాన (సి) దీపక్‌ చహర్‌ (బి) హార్దిక్‌ 8; చమీర (రనౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 262.

వికెట్ల పతనం: 1–49, 2–85, 3–89, 4–117, 5–166, 6–186, 7–205, 8–222, 9–262.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 9–0–63–0, దీపక్‌ చహర్‌ 7–1–37–2, హార్దిక్‌ పాండ్యా 5–0–33–1, చహల్‌ 10–0–52–2, కుల్దీప్‌ యాదవ్‌ 9–1–48–2, కృనాల్‌ పాండ్యా 10–1–26–1.

భారత ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) అవిష్క ఫెర్నాండో (బి) ధనంజయ 43; ధావన్‌ (నాటౌట్‌) 86; ఇషాన్‌ కిషన్‌ (సి) భానుక (సి) సందకన్‌ 59; పాండే (సి) షనక (బి) ధనంజయ 26; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 31; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (36.4 ఓవర్లలో 3 వికెట్లకు) 263.

వికెట్ల పతనం: 1–58, 2–143, 3–215. బౌలింగ్‌: చమీర 7–0–42–0, ఉదాన 2–0–27–0, ధనంజయ 5–0–49–2, సందకన్‌ 8.4–0–53–1, అసలంక 3–0–26–0, హసరంగ 9–1–45–0, కరుణరత్నే 2–0–16–0.