IND vs SA 1st Test 2021: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకే ఆలౌట్, 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు
Mohammad Shami (Photo Credits: Twitter/ICC)

సెంచురియన్ లో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. పిచ్ పేసర్లకు విశేషంగా సహకరిస్తున్న నేపథ్యంలో లక్ష్యఛేదన సఫారీలకు కూడా సులువుగా కనిపించడంలేదు.

టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో సఫారీ పేసర్లు కగిసో రబాడా, మార్కో జాన్సెన్ నిప్పులు చెరిగారు. వీరిద్దరూ చెరో 4 వికెట్లు తీశారు. ముఖ్యంగా, కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న లెఫ్టార్మ్ సీమర్ మార్కో జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా లైనప్ ను దెబ్బతీశాడు. మరో పేసర్ లుంగి ఎంగిడికి 2 వికెట్లు దక్కాయి. టీమిండియా ఇన్నింగ్స్ లో అత్యధికంగా రిషబ్ పంత్ 34 పరుగులు చేశాడు. వేగంగా ఆడిన పంత్ 34 బంతులు ఎదుర్కొని 6 బౌండరీలు బాదాడు. రహానే సైతం ధాటిగానే ఆడాడు. రహానే 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 20 పరుగులు రాబట్టాడు.

రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 14 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత పేసర్ మహమ్మద్ సమీ చెలరేగుతున్నాడు. ఇప్పటికే Aiden Markram, Keegan Petersen వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.