అఫ్గాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. మొహాలీ (పంజాబ్) వేదికగా జరిగిన తొలి టీ20లో అఫ్గాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (20 బంతుల్లో 31, 5 ఫోర్లు), తిలక్ వర్మ (22 బంతుల్లో 26, 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో భారత్ విక్టరీ నమోదు చేసింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఈనెల 14న ఇండోర్ వేదికగా జరుగుతుంది.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన అఫ్గాన్ బ్యాటర్లను ఆది నుంచి భారత బౌలర్లు కట్టడి చేశారు. ఆ జట్టును 158 పరుగులకే కట్టడి చేశారు. సీనియర్ బ్యాటర్ మహ్మద్ నబీ (27 బంతుల్లో 42, 2 ఫోర్లు, 3 సిక్సర్లు)కి తోడు అజ్మతుల్లా ఒమర్‌జయ్ (22 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్సర్) నిలవడంతో అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ (33/2), అక్షర్ పటేల్ (23/2) లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అలాగే దూబే రెండు ఓవర్లు వేసి తొమ్మిదిపరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు.