India vs Australia 1st Test 2020: ఘోరాతి ఘోరంగా..చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన టీం ఇండియా, 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసీస్ ఘన విజయం
Pat Cummins reacts while dismissing Jasprit Bumrah (Photo Credits: PTI)

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టులో (India vs Australia 1st Test 2020) 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసీస్ ఘన విజయం సాధించింది. 36/9 పరుగుల దగ్గర భారత రెండో ఇన్నింగ్స్ (AUS Win Series Opener by 8 Wickets) ముగిసింది. దీంతో 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఆటగాళ్లలో జో బర్న్(51) అర్ధసెంచరీతో నాటౌట్ కాగా, మాథ్యూ వేడ్(33) రనౌట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో మార్నస్ ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర పెవిలియన్ చేరాడు. కంగారుల జట్టు 21 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనీ ఎంపికయ్యాడు. 73 పరుగులు చేయడమేగాక, ఏడు క్యాచ్‌లు అందుకున్నాడు.

ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు (India vs Australia 1st Test) రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 36 పరుగులు మాత్రమే చేసింది. భారత క్రికెట్ జట్టు టెస్ట్ చరిత్రలోనే ఇది అత్యల్పం. గత రికార్డులను పరిశీలిస్తే.. 1974 లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 42 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 1947లో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు చేయగా, 1952లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు, 1996లో దక్షిణాఫ్రికాతో జరిగిన డర్బన్ మ్యాచ్‌లో 66 పరుగులు, 1948లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లె 67 పరుగులు చేసింది.

పోరాడి ఓడిన ఇండియా, 12 పరుగుల తేడాతో మూడో టీ20లో ఆస్ట్రేలియా ఘన విజయం, భారత్‌ని గెలిపించని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం

ఆసీస్‌ పేసర్లు హాజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌ దాటికి ఏడుగురు భారత బ్యాట్స్‌మెన్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా..ముగ్గురు ఖాతా తెరవకపోవడం విశేషం. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 244 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ విజయంతో పింక్‌బాల్‌టెస్టుల్లో ఆసీస్‌ వరుసగా ఎనిమిదో విజయం సొంతం చేసుకొని తన రికార్డును మరింత పటిష్టపరుచుకుంది.

కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 25 శుక్రవారం మొదలుకానుంది. విరాట్‌ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశం వెళ్లనున్న నేపథ్యంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

టీమిండియా ఘోర ఓటమిని అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మెరుగైన ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌ వంటివారిని పక్కనబెట్టి పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ను ఆడించారని ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా జట్టు కూర్పులో టీమిండియా యాజమాన్యం శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు