ఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని సీరిస్ కోల్పోయింది. పటిష్టమైన ఆస్ట్రేలియా టీం ముందు చతికిలపడింది. ఆసీస్‌తో జరిగిన మొదటి వన్డేలో ఓడిపోయిన భారత్ రెండో వన్డేలోనూ పరాజయం చెందింది. దీంతో టీమిండియా సిరీస్‌ను (India vs Australia 2nd ODI 2020) ఆస్ట్రేలియా చేతిలో పెట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను గెలిచిన ఆసీస్.. రెండో వన్డేలో కూడా 51 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో (IND vs AUS 2nd ODI) కైవసం చేసుకుంది.
రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. వార్నర్(83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫించ్(60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ ), స్టీవ్ స్మిత్(104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), లబూషేన్(70; 61 బంతుల్లో 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్( 63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్సర్లు)లు రాణించడంతో ఆసీస్ రికార్డు స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం లభించింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌ను వార్నర్-ఫించ్‌లు దాటిగా ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఆసీస్‌కు తిరుగులేకుండా పోయింది. తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్ ఫ్రీగా బ్యాటింగ్ చేసి పరుగులు వరద పారించారు. ఆసీస్ 4 వికెట్లకు 389 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లంతా మూకుమ్మడిగా పరుగులు సమర్పించుకోవడంతో ఆసిస్ రికార్డు స్కోరు సాధించింది. ఇప్పటివరకు భారత్‌పై ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో షమి, పాండ్యా, బూమ్రాలకు తలో వికెట్ తక్కింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధవర్(23 బంతుల్లో 30), మయాంక్ అగర్వాల్(26 బంతుల్లో 28) శుభారంభాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత వచ్చిన కోహ్లీ(87 బంతుల్లో 89) మాత్రం పోరాడాడు. శ్రేయాస్ అయ్యర్(36 బంతుల్లో 38) మళ్లీ నిరాశపరిచాడు. అయితే అయ్యర్ తరువాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(66 బంతుల్లో 76) కోహ్లీకి సహకారం అందించాడు. ఇద్దరూ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా నడించారు. అయితే కోహ్లీ అవుట్ కావడంతో భారం మొత్తం రాహుల్ పైనే పడింది.
పాండ్యా(31 బంతుల్లో 28) మొదటి మ్యాచ్‌లోలా రాణించలేకపోయాడు. చివర్లో జడేజా బ్యాట్ ఝుళిపించినా అప్పటికే మ్యాచ్ భారత్ చేజారిపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 51 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో రాణించినా బౌలర్ల వైఫల్యం కారణంగా భారత్‌కు ఓటమి తప్పలేదు.