హార్దిక్ పాండ్యా (4/24; 71) ఆల్‌రౌండ్ మెరుపులకు.. రిషబ్ పంత్ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకం తోడవడంతో మూడో వన్డేలో (India vs England 3rd ODI) టీమ్‌ఇండియా విజయభేరీ మోగించింది. హోరాహోరీగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టును చిత్తుచేసింది. ఫలితంగా 2021-22 ఇంగ్లండ్ పర్యటనను టీమ్‌ఇండియా సిరీస్ పరాజయం లేకుండా ముగించింది. టెస్టు సిరీస్‌ను 2-2తో ‘డ్రా’ చేసుకున్న టీమ్‌ఇండియా.. టీ20, వన్డే సిరీస్‌లను 2-1తో కైవసం చేసుకుంది.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్ (80 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జేసన్ రాయ్ (31 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు.హార్దిక్ పాండ్యా (4/24) వన్డే కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగా... చహల్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసి గెలిచింది. రిషభ్ పంత్ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించేదాకా (Rishabh Pant century ) క్రీజులోనే నిలిచాడు. హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 71; 10 ఫోర్లు) ధాటిగా ఆడాడు. పంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ... హార్దిక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో మూడు ఫోర్లు కొట్టి ఔటైన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. తాజా పోరులోనూ మూడు ఫోర్లు కొట్టి పెవిలియన్ బాటపట్టాడు. విల్లే వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన విరాట్.. అతడి తదుపరి ఓవర్‌లో మరో బౌండ్రీ అరుసుకున్నాడు. ఈ మూడు షాట్లు కచ్చితత్వంతో ఆడటంతో ఇక కోహ్లీ గాడినపడ్డట్లే అనుకుంటున్న సమయంలో గత మ్యాచ్ హీరో టాప్లే కీపర్ క్యాచ్ ద్వారా అతడిని వెనక్కి పంపాడు.