దక్షిణాఫ్రికా- భారత్ మధ్య తొలి టెస్టులో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది. మూడో రోజు తొలి సెషన్ లోపే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులకు (Team India all out for 327 runs ) ఆలౌట్ అయింది. నిన్న వర్షం కారణంగా రెండో రోజు ఆట (India vs South Africa 1st Test 2021) రద్దయిన సంగతి విదితమే. తేమతో ఉన్న పిచ్ ఉపయోగించుకున్న సఫారీలు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. 272/3 పటిష్ఠ స్థితిలో ఉన్న టీమ్ ఇండియా ఇంకో 55 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ ఎంగిడి 6/71తో భారత బ్యాటర్లను వణికించాడు,
తొలి రోజు శతకంతో చెలరేగిన కెఎల్ రాహుల్ (123) మరో పన్నెండు బంతులు ఆడి ఒకే పరుగు చేశాడు. రబాడ బౌలింగ్ లో ఔటయ్యాడు. అజింక్యా రహానే కుదురుకున్నట్లు కనిపించినా అర్థ శతకానికి రెండు పరుగుల దూరంలో 48 వద్ద ఔటై పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన భారత్ బ్యాటర్లు ఏ ఒక్కరు కూడా క్రీజులో నిలవలేకపోయారు. రిషబ్ పంత్ 8, రవిచంద్ర అశ్విన్ 4, శార్దూల్ ఠాకూర్ 4, షమీ 8, బుమ్రా 14, సిరాజ్ 4 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 6, రబాడ 3, జాన్ సన్ ఒక వికెట్ పడగొట్టారు.
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఏడు ఓవర్లలో సఫారీలు ఒక్క వికెట్ కోల్పోయి 21 పరుగులు చేశారు.