Shardul Thakur (Photo Credits : Getty Images)

Barabati Stadium/Cuttack, December 23: కటక్ లోని బారాబతి స్టేడియం (Barabati Stadium) వేదికగా వెస్టిండీస్‌తో చావో రేవో అంటూ తలపడిన చివరి మ్యాచ్ లో (IND vs WI 3rd ODI 2019)టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్‌ను కోహ్లి సేన చేజ్ చేసింది. థ్రిల్లింగ్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

48.4 ఓవర్లలోనే కోహ్లి సేన 316 పరుగులు సాధించింది. ఈ గెలుపుతో 2-1 తేడాతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇన్నింగ్స్ చివరలో పేసర్ శార్దూల్‌ ఠాకూర్ (Shardul Thakur) సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) విలువైన పరుగులు చేయడంతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది.

316 లక్ష్య చేదనతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (Rohit Sharma), కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) విండీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. మొదటగా నెమ్మదిగా ఆడిన రోహిత్.. ఆ తర్వాత గేర్ మార్చి 52 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ చేశాడు. మరోవైపు రాహుల్ కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. రోహిత్ (63), రాహుల్ (77) మొదటి వికెట్‌కు 122 పరుగులు జోడించారు. రోహిత్ పెవిలియన్ చేరిన అనంతరం రాహుల్ తడబడినా.. విరాట్ కోహ్లీ (85) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ చేయగా.. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ (7), రిషబ్ పంత్ (7), కేదార్ జాదవ్ (9) తీవ్రంగా నిరాశపరిచారు. అయితే జడేజా (39)తో కలిసి కోహ్లీ టీమిండియాను విజయానికి చేరువ చేసాడు.

BCCI Tweet

కోహ్లీ అనూహ్యంగా బోల్డ్ కావడంతో చివర్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఒత్తిడి మొత్తం జడేజాపై ఉన్న సమయంలో శార్దూల్ ఠాకూర్ మెరుపులు మెరిపించాడు. క్రీజులోకి వచ్చిరావడంతోనే పరుగుల వరద పారించాడు. కేవలం 6 బంతుల్లో 17 పరుగులు చేసి కోహ్లీసేనకు అపురూప విజయాన్ని అందించాడు. వెస్టిండీస్‌పై భారత్ వరుసగా పదో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో సొంతగడ్డపై తిరుగులేదని టీమిండియా మరోమారు నిరూపించుకుంది. మంచి విజయంతో టీమిండియా ఈ ఏడాదిని ముగించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (21), షాయ్ హోప్ (42) తొలి వికెట్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. 57 పరుగుల వద్ద లూయిస్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోస్టన్ చేజ్ (38) కూడా బ్యాట్ ఝళిపించాడు. హోప్ తర్వాత వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్ (37) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే నవ్‌దీప్ సైనీ వీరిద్దరినీ బోల్తా కొట్టించాడు.

ఆపై నికోలస్ పూరన్ (89), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (74)లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. పొలార్డ్ అయితే సిక్సర్లతో చెలరేగాడు. వీరిద్దరి దెబ్బకు స్కోరు బోర్డు పరుగులు తీసింది. దీంతో విండీస్ భారీ పరుగులు చేసింది. భారత బౌలర్లలో సైనీ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, షమీ, జడేజాలు చెరో వికెట్ తీశారు.

జయసూర్య రికార్డు బద్దలు

ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డ్ వేసుకున్నాడు. 22 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేస్తూ ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డ్ శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య పేరున ఉంది. 1997లో సనత్ జయసూర్య ఒకే ఏడాదిలో 2వేల 387 పరుగులు సాధించాడు. 22 ఏళ్లుగా ఆ రికార్డ్ ను ఎవరూ క్రాస్ చేయలేకపోయారు.

ఇప్పుడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఆ రికార్డ్ ను బద్దలుకొట్టాడు. కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర రికార్డ్ ను అధిగమించాడు. 2019 కేలండర్ ఇయర్ లో రోహిత్ శర్మ.. 2వేల 379 పరుగులు చేశాడు. విండీస్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో మరో 9 పరుగులు జోడించి రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచులో రోహిత్ 63 పరుగులు సాధించాడు.