The Indian team during the fourth Test (Photo credit: Twitter)

ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య ఇంగాండ్ జట్టును 157 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ లో భారత్ 2-1 ముందంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా, ఇంగ్లాండ్ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు కట్టడిచేసింది. అంటే 99 పరుగుల ఆధిక్యాన్ని ప్రత్యర్థి జట్టుకే కల్పించింది. ఇక మ్యాచ్‌పై పట్టు కోల్పోతుందనుకున్న వేళ, దెబ్బతిన్న పులిలా విరుకుపడిన భారత్, రెండో ఇన్నింగ్స్ లో విజృంభించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ (127) తో పాటు, పూజారా 61 పరుగులు, రిషభ్ పంత్ 50, శార్దూల్ ఠాకూర్ 60 పరుగులు సాధించి హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ కోహ్లీ 44, రాహుల్ 46 పరుగులతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు భారీ స్కోర్ చేసింది. దీంతో టీమిండియాకు 367 పరుగుల ఆధిక్యం లభించింది.

అనంతరం, ఆట నాలుగో రోజున 368 పరుగుల విజయలక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు ఇద్దరూ వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లాండ్ చివరి రోజు ఓవర్ నైట్ స్కోర్ 77/0 వద్ద ప్రారంభమైంది, విజయానికి 291 పరుగులు అవసరం. ఓపెనర్లు హసీబ్ హమీద్ 63 మరియు రోరీ బర్న్స్ 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కొద్ది సేపటికే ఓపెనర్లు ఇద్దరూ ఔట్ చేయబడిన తర్వాత భారత బౌలర్ల వికెట్ల వేట మొదలైంది. మధ్యాహ్నం సెషన్‌లో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా కలిసి చెరి రెండు వికెట్లు కూల్చి, ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్‌ని అల్లకల్లోలం చేశారు. ఇంగ్లాండ్ కేవలం 62 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ కూడా ఓపెనర్ రోరీ బర్న్స్ వికెట్ తో పాటు, కీలకమైన కెప్టెన్ జోరూట్ వికెట్ తీశాడు. ఆ తర్వాత ఉమేష్ యాదవ్ చివరి 3 వికెట్లు పడగొట్టడంతో భారత్ గెలుపు ఖాయం అయింది. ఇండియా బౌలర్లు సమిష్టిగా రాణించి ఇంగ్లాడ్ పతనాన్ని శాసించారు.

దీంతో భారత్ 50 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాస్తూ ఓవల్ మైదానంలో మరోసారి గెలిచింది. ఓవల్‌లో భారత్ చివరిసారిగా 1971లో గెలిచింది, ఇప్పుడు కోహ్లీ సారథ్యంలో మరో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.

స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ 191/10

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 290/10

భారత్ రెండో ఇన్నింగ్స్ 466/10

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 210/10

'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' - రోహిత్ శర్మ

ఇక ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ లో భారత్ 2 విజయాలతో ఆధిక్యంలో ఉంది. సెప్టెంబర్ 10 నుంచి చివరి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ రద్దైనా లేకా డ్రాగా ముగిసినా సిరీస్ ఇండియాకే దక్కుతుంది. ఒకవేళ చివరి టెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ సమం అయి కప్ సంయుక్తంగా పంచుకుంటాయి.

కాగా, ఓవల్ టెస్టు విజయంతో ఇండియా ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ ర్యాంకింగ్స్ 2021-23లో తిరిగి అగ్రస్థానానికి ఎగబాకింది. భారత్ ఫస్ట్ ర్యాంక్ లో కొనసాగుతుండగా పాకిస్థాన్ మరియు వెస్ట్ ఇండీస్ జట్లు వరుసగా రెండు, మూడో ర్యాంకులలో కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్ నాలుగో ర్యాంకుకు పడిపోయింది.